ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
యంత్ర ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరు
తిర్యాణి, ఆగస్టు 20 : పురాతన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ అన్నారు. మండలంలోని గంభీరావుపేట్ గ్రామంలో వేద పండితుల నడమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయ విగ్రహ యంత్ర ప్రతిష్ఠాపన మహాపూజ మహోత్సవానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి ఎమ్మెల్యే ఆత్రం సక్కు కొడుకు ఆత్రం వినోద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్ మాట్లాడుతూ మరుగున పడ్డ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తున్నదన్నారు. గంభీరావుపేట్ గ్రామంలో ప్రతిష్ఠించిన ఈ ఆలయం మరింత అభివృద్ధ్ది చెందేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ ఆలయానికి ధూపదీప నైవేద్య పథకం అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి సహకారంతో, తన శక్తి మేరకు సహాయ సహకారాలు అందించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని మహోన్నతమైనదిగా తీర్చిదిద్దుతామన్నారు.
కాగా.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం చింతపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తకు చెందిన హార్డ్‌వేర్ షాప్‌ను ప్రారంభించారు. మగర్మోడీ కన్నేపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు తమకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్సీ.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, సర్పంచ్ ముత్యం వరలక్ష్మీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మండల అధ్యక్షుడు హన్మండ్ల జగదీశ్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేశ్, సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఆ సంఘం ఉపాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బొమ్మగోని శంకర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.