గోదావరి తీరం, వాగుల వద్దకు వెళ్లవద్దు
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 8: మంచిర్యాలపట్టణంలోని వరద ముంపునకు గురైన ప్రాంతాలను బుధవారం కలెక్టర్ భారతీ హోళికేరి పరిశీలించారు. పట్టణంలోని గోదావరి నది వద్ద ఉన్న పుష్కరఘాట్‌కు చేరుకుని వరద పరిస్థితిని అంచనా వేశారు. గోదావరి నదిలో రెండు ఒడ్లను తాకుతూ ప్రవహించడంతో ఇటుగా ప్రజలను ఎవరినీ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎన్టీఆర్ నగర్‌కు చేరుకుని అక్కడ వరదలో ఇండ్లు మునిగిన కుటుంబాలతో మాట్లాడారు. వర్షాలు తగ్గే వరకూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, ప్రస్తుతం వరదలు ఏ క్షణంలోనైనా పెరిగే పరిస్థితి ఉందని తెలిపారు. అక్కడ ఉన్న పలువురు మహిళలు మాట్లాడుతూ గతంలో వరదల్లో తాము సర్వం కోల్పోయామని, నష్ట పరిహారం అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వానికి నివేదిక పంపామని, రాగానే వాటిని అందిస్తామని చెప్పారు. అక్కడి నుంచి రాళ్ల వాగు కాజ్‌వేకు చేరుకుని వరదప్రవాహాన్ని పరిశీలించారు. కాజ్‌వేపై తిరుగుతూ నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు. అక్కడే గతంలో వర్షాలకు కొట్టుకు పోయిన కాజ్‌వేను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎస్ బాలకృష్ణ, మున్సిపల్ ఇంజినీర్ మధూకర్, టీపీవో సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.