కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 18 : ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం 2022-23 బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ.8,784.11లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఆదాయ వనరులను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ అభివృద్ధి, ప్రజల కష్టాలను తీర్చేందుకు నిధులను వెచ్చించాలని పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద మున్సిపాలిటీకి అంచనా ఆదాయం రూ.5,765లక్షలు కాగా, సాధారణ నిధులు రూ.3,011.81లక్షలుగా అంచనావేశారు. రూ.154.92లక్షలను వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మురికి వాడల అభివృద్ధి, కొత్తగా విలీనమైన గ్రామాల అభివృద్ధికి కేటాయించారు. పట్టణంలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి చెల్లింపుల పూర్తి నివేదికలు సమర్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆమోదించామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.