మంచిర్యాల, మే 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు మంత్రివర్గంలో చోటు కోసం పట్టు బిగిస్తున్నారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన మీనా క్షి ఒక్కొక్కరితో పది నిమిషాలు మాట్లాడారు.
ఈ సమయంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందా? అన్నది స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మా రింది. ముందు నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికీ వారు మంత్రి పదవి కోసం పట్టు బిగిస్తూ వస్తున్నారు. రాష్ట్రస్థాయి నుంచి ఢిల్లీ దాకా మంతనాలు చే స్తున్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్‌తో భేటీలోనూ ఇద్దరు నేతలు ఎవరికీ వారు ‘నాకు మంత్రి పదవి కావాలి..’ అని అడిగినట్లు సమాచారం. ఈ వ్య వహారం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
టీపీసీసీ కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యం ఇస్తారా?
ఉమ్మడి జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నా పార్టీలో తమకు సముచిత స్థానం లేదనే నిరాశలో ఉన్నారు. నెల 30వ తేదీన పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉండడంతో చాలా మంది పదవులపై ఆశలు పెంచుకున్నారు. ఇటీవల నామినేట్ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికీ చోటు ఇవ్వలేదు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా కరీంనగర్ నాయకులకు బరిలోకి దించారు. దీంతో ఈసారి పీసీసీ పదవులతోపాటు కార్పొరేషన్ల పదవుల కోసం ఆ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు.
ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కంది శ్రీనివాస్‌రెడ్డి జిల్లా ఇన్చార్జి పదవి కావాలని మీనాక్షి నటరాజన్‌కు కోరినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన నాయకులు పార్టీ పదవులపై ఆశలు పెంచుకున్నారు. పీసీసీ పదవులతోపాటు 30వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల, చెన్నూర్‌తోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. దీంతో ముగ్గురిలో పార్టీ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తిగా మారింది.
ఈ ముగ్గురిలో ఎవరికైనా ఒకరికీ పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పదవి ఎవరికి వస్తుందో వారికి ఇక మంత్రివర్గంలో చోటు లేనట్లేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భేటీలో మీనాక్షి నాటరాజన్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల పార్టీలో చోటుచేసుకున్న అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. కాగజ్‌నగర్‌లో కోనప్ప తిరుగుబాటు, చెన్నూర్‌లో ఎమ్మెల్యేపై ఓ వర్గం బహిరంగ విమర్శలు, కాళేశ్వరంలో ఎంపీ వంశీ ప్రొటోకాల్ రగడ వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ వెనుకబాటుకు కారణం ఏంటీ? ఏం చేస్తే బాగుంటుందని నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు చర్చ జరుగుతున్నది.
మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ పార్టీని పట్టించుకోవడం లేదా? సమన్వయం లేకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామా? అంటూ ఆమె జిల్లా నాయకులను ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీలో సమన్వయలోపంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో పెద్ద కుదుపు తీసుకొచ్చింది. 30వ తేదీన పీసీసీ కార్యవర్గం జరిగాక పదవులు రాని నాయకులు ఏం చేస్తారు. మంత్రి వర్గంలో చోటు దక్కకపోతే ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగుర వేస్తారా? వేరే పార్టీలో చేరుతారా? అన్నది ఆసక్తిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీకి బలం చేకూరుస్తాయా? లేకపోతే జిల్లాలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తాయా? అన్నది తేలాల్సి ఉంది.