నస్పూర్/కోటపల్లి, అక్టోబర్ 14 : జిల్లా కేం ద్రంలోని నస్పూర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్.. అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కోటపల్లికి చెందిన మంత్రి రామయ్య ఎస్సీ గురుకులానికి నూతన భవనం నిర్మించాలని, కోటపల్లి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో కోల్పోయిన 100 మందికి ఇండ్లు మంజూరు చేయాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం పలు సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి అందించిన వినతి పత్రం ప్రతులను కూడా కలెక్టర్‌కు చూపించారు. అలాగే కాసిపేట మండలం కోమటి చేను శివారులో తన పేరు మీదున్న ఎకరం భూమిని తాను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి కాజేశారని, తనకు న్యాయం చేయాలని మందమర్రికి చెందిన రొడ్డ మల్లయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి వేడుకున్నాడు.