కన్నెపల్లి/ పెంచికల్పేట్, మార్చి 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు పూనుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న పుస్తకాలే కాకుండా దాతల నుంచీ సేకరిస్తు న్నారు. కాగా, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం కుర్మగూడ ప్రభుత్వ పాఠశాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ కేజీబీవీల్లో ఉపాధ్యాయుల వినూత్న రీతిలో ఆలోచించి పుస్తకాలు సేకరిస్తున్నారు. విద్యార్థుల్లో పఠనా శక్తిని పెంచేందుకు కృషి చేస్తు న్నారు. కరోనా నేపథ్యంలో విద్యకు దూరమై, పఠనా శక్తిని కోల్పో యిన విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడనుంది. కుర్మగూడ పాఠశాలలో ప్రస్తుతం 110 పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కథలు, నాటకాలు, కవిత్వాలు, స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర, దేశ చరిత్రకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గ్రంథాలయం నిర్వహణకు విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేసి చిన్న తరగతుల విద్యార్థులకు అలవాటయ్యేలా బాధ్యతలు అప్పగించారు. ప్రతి విద్యార్థి ఒక పుస్తకం ఇంటికి తీసుకెళ్లి, మళ్లీ పుస్తకాన్ని పాఠశాలలో అప్పగించేలా సూచనలు చేస్తున్నారు. విద్యార్థులే కాకుండా గ్రామంలోని యువకులు కూడా ఈ పుస్తకాలను తీసుకెళ్లి, చదివి పెద్దలకు, యువతకు చదువుపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. ఈ పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం టాకింగ్ బుక్ అనే పరికరం కూడా అందుబాటులో ఉంచారు. దీంతో విద్యార్థులు కూడా శ్రద్ధగా చదువుతుండడంతో పాటు రెగ్యులర్‌గా పాఠశాలకు వస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే చదువుపై ఆసక్తి పెంచేందుకు రీడ్ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా ఆలోచించి విద్యార్థులు చదువుకు నేలా చూస్తున్నాం. గ్రామంలో డ్రాపౌట్స్ లేకుండా చేయగలుగు తున్నాం. ప్రస్తుతం సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు రోజుకో పుస్తకాన్ని తీసుకెళ్లి చదువుతున్నారు. అలాగే పాఠశాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రీడ్ కార్యక్రమం విద్యా ర్థులకు ఎంతో ఉపయోగపడుతున్నది. మున్ముందు గ్రామస్తులు, దాతల సహకారంతో ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్నాం. – చిన్నయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
పెంచికల్పేట్ కేజీబీవీలోనూ గ్రంథాలయ నిర్వహణకు పుస్తకాలు అందించాలని దాతల ను సామాజిక మాధ్యమాల ద్వారా విద్యాలయంలోని టీచర్లు కోరుతున్నారు. విద్యార్థు లకు ఉపయోగపడే ఏ పుస్తకాన్నైనా తమకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదాహర ణకు పలు పుస్తకాలను అక్కడి ఉపాధ్యాయురాలు స్నేహలత తెలిపారు. బాపు బొమ్మల పంచతంత్రం. చెట్లు నాటిన మనిషి, ఎగిరే క్లాస్‌రూం, ఎగిరే పెట్టే, నొప్పి డాక్టరు, నీలపుదీపం, టాల్‌స్టాయ్ కథలు, ఇద్దరు మిత్రులు, యుద్ధ శాంతి, కోడిగుడ్డంత జ్ఞానపు గింజ, రాజు పేద, కన్నీరు, వెన్నెల వెలుగు, అమ్మ, ప్రకృతి నేర్పిన పాఠాలు, బొమ్మల గుర్రం, పిల్లల హాస్యకథలు, యువరాణి లాస్య, బాలసాహిత్యం, మహా మాయాలోకం, చంద్రశేఖర్ ఆజాద్, అంకిత, కిరణ్ జమ్ముల మడగ, పగటి కల, మేము పిల్లలం, గీజుబాయి, తెలంగాణ కథలు, ఇలాంటి పుస్తకాలను పంపించాలని కోరుతున్నారు. దాతల ఇష్టానుసారం వారు ఎంపిక చేసుకొని పంపిస్తే పిల్లల అభ్యున్నతికి ఉపయోగపడుతాయని వివిధ సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థిస్తున్నారు. పుస్తకాలు అందించి, విద్యార్థుల నుంచి కృతజ్ఞతలు అందుకోవాలని కోరుతున్నారు.
పెంచికల్పేట్, మార్చి 10: పుస్తకం ఒక మంచి నేస్తం. మా బడికి లైబ్రరీ సమకూర్చుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని పుస్తకాలను మేం కొనుగోలు చేశాం. మరిన్ని పుస్తకాలు అందించాలని దాతలను కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ‘చదువు..ఆనందించు..అభివృద్ధి చెందు’ అని పిల్లలు ధారాళంగా చదివేలా చేయాలనే లక్ష్యంతో 100 రోజుల రీడింగ్ ప్రోగ్రాం ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా పుస్తకాల నిధి తయారు చేసుకోవాల నుకుంటున్నాం. 12 ఏండ్ల నుంచి 17 ఏండ్ల వయస్సు పిల్లలు చదవాల్సిన ఏ పుస్తకం పంపినా సంతోషంగా స్వీకరిస్తాం. పాఠ్యపుస్తకాలు చదవడానికి విసుగు చెందేవాళ్లు కూడా కథలనే సరికి ఆనందంగా చదువుతారు. ఆకర్షణీయంగా ఉన్న బొమ్మల కథలు పిల్లల్లో చదవాలనే కోరిక పెంచుతాయి. పక్క పిల్లలు చదువుతుంటే అసలే చదువరు అనుకున్న పిల్లలు సైతం తొంగి చూస్తారు. ఎన్ని ఎక్కువ పుస్తకాలు ఉంటే అంత ఎక్కువ మందికి ఉపయోగం. అందుకే పుస్తకాలు పంపాలని దాతలను కోరుతున్నాం. మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నా.
-స్నేహలత, ఉపాధ్యాయురాలు, పెంచికల్‌పేట కేజీబీవీ
మా టీచర్లు ప్రతి రోజూ తరగతి పుస్తకాలే కాకుం డా కథలు, నాటికలు, దేశ, స్వాతంత్య్ర సమర యోధుల పుస్తకాలను చదివిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుంచి పుస్తకాలు తీసుకెళ్లి ఇంట్లో కూడా చదివి పాఠశాలకు తీసుకువచ్చి అప్పగిస్తున్నాం. దీంతో మాకు చదవడం అంటే ఇష్టం పెరుగుతున్నది. కథల పుస్తకాలు చాలా బాగుంటున్నయ్. దేశం కోసం ప్రాణలర్పించిన నాయకుల జీవిత గాథలను తెలుసుకునే అవకాశం కలుగుతున్నది. -సమీరా, ఐదో తరగతి