నిర్మల్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మక్క రైతులకు కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు మద్దతు ధర దక్కక నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతుల కష్టాన్ని దళారులు, ప్రైవేట్ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోతుండడంపై రైతులు మండిపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో 16వేల ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగు చేశారు. జిల్లాలో ఈ సారి 4,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అధిక వర్షాలతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా చోట్ల తెంపి ఆరబెట్టిన మక్క కంకులు కూడా తడిసిపోయాయి. కొన్ని చోట్ల కంకులకు మొలకలు వచ్చాయి. మిగిలిన పంటనైనా అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా పంటకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని నిర్మల్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్(జీ), లక్ష్మణచాంద, సారంగాపూర్, ఖానాపూర్ మండలాల్లో మక్కపంట చేతికి రాగా, రైతులు మక్కలను రోడ్లపై ఆరబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారోనని ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మక్క రైతులకు క్వింటాలుకు రూ.330 బోనస్ కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ప్రస్తుతం బోనస్ సంగతి దేవుడెరుగు.. అసలు మద్దతు ధరకే కాంగ్రెస్ సర్కారు ఎసరు పెట్టిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఈ వానకాలం సీజన్లో భారీ వర్షాలు కురియడంతో దాని ప్రభావం పంట దిగుబడిపై పడింది. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల పంట దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం ఎకరానికి 20 క్వింటాళ్ల కంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. తగ్గిన పంట దిగుబడికి తోడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు మంచి నాణ్యత కలిగిన మక్కలను రూ.1800 నుంచి 1900లకు కొనుగోలు చేస్తుండగా, సాధారణ రకం మక్కలకు రూ.1500 మాత్రమే చెల్లిస్తున్నారు. మద్దతు ధరతో పోల్చితే రైతులు క్వింటాలుకు రూ.500 నుంచి 700 వరకు నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎకరానికి రూ.10వేల నుంచి 14వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధరను కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వానకాలం సీజన్లో రెండెకరాల్లో మక్క పంట వేసిన. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు వస్తుందని అనుకున్న. వానలతో పంట దెబ్బతిని 13 క్వింటాళ్ల చొప్పున రెండు ఎకరాలకు 26 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలకు లేక ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.1900లకు అమ్మిన. క్వింటాలుకు రూ.500 చొప్పున 13వేల నష్టపోయిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మక్కలు కొంటలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి బాధలు లేకుండే.
-జీ.భాస్కర్, రైతు, తాంశ
3 ఎకరాల్లో రెండెకరాల్లో వరి, ఎకరంలో మక్కపంట వేసిన. మక్క పంటకు పెట్టుబడి ఖర్చులు రూ.10వేల వరకు కాగా, 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సారి మక్కలకు ధర లేకపోవడంతో నష్టపోతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ.1900 చొప్పున అమ్మిన. ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రూ.10వేల వరకు అదనంగా వచ్చేవి. ఇప్పటికైనా కేంద్రాలను ఏర్పాటు చేసి మక్క రైతులను ఆదుకోవాలి.
-రాజశేఖర్, రైతు, తాంశ