కాసిపేట : విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను (Summer Training Camps ) సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ( MEO Venkateshwar Swamy ) కోరారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం వేసవి శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో ఇంటి వద్ద డిజిటల్ మీడియాకు అలవాటు పడకుండా, వారి సృజనాత్మకత, నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంగా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరంలో డాన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, గేమ్స్ తదితర అంశాలపై ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు.
ఈ వేసవి శిబిరాలు విద్యార్థుల మానసిక ఉల్లాసం, శారీరక వికాసానికి ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. శిబిరానికి హాజరయ్యే విద్యార్థులకు ప్రతిరోజు స్నాక్స్ కూడా అందిస్తామని వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరం ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనున్నదని తెలిపారు.