ఆరోజు ఖుత్బా (శుక్రవారపు ప్రసంగం) తర్వాత ఇమామ్ సాబ్ నన్ను మింబర్ (ప్రసంగ వేదిక) దగ్గరకు పిలిచి..“క్యా జాఫర్ సాబ్! ఆప్ ఖురాన్ మూ జుబాని బోల్నేవాలా ఏక్ షరీఫ్ ఆద్మీ హై! క్యాఁ ఆప్ కాఫిర్ కె సాత్ దేకర్ ఆప్ బి కాఫిర్ బన్ నా చాహతేహై క్యా? (అన్య మతస్తులకు సహకరించి ద్రోహిగా మారుతావా?)” అన్నాడు. దైవ ప్రసంగం తర్వాత ప్రశాంత వాతావరణంలో ఇమామ్ గారి నుంచి కటువుగా వచ్చిన ప్రశ్న అది. నన్ను ప్రశ్నించమని అడిగిన వారు నాసమాధానం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బహుశా వారి క్రోధపు చూపులకు శక్తి ఉంటే అవి నన్ను దహించి బూడిద చేసేవి.మనను అర్థం చేసుకోని వాళ్లతో వాదన కన్నా, కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిదనుకొని, నా అంతరాత్మకు విరుద్ధంగా మౌనంగా తల వంచుకున్నాను.
“క్యా జాఫర్ సాబ్! బోలో..?” మళ్లీ ప్రశ్నించాడు ఇమామ్ సాబ్.చిన్నప్పుడు చదివిన ‘ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి’ పద్యం గుర్తొచ్చి..
“మై కోషిస్ కరుంగా ఇమామ్ సాబ్” అన్నాను, అక్కడి వాతావరణాన్ని తేలిక చేయడానికన్నట్లు. “జావో… జాకే ధూండ్కర్ లావో జీ” ఇమామ్ గారి ఆదేశం విని తలెత్తి చూసాను. నన్ను ప్రశ్నించమన్న వాళ్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఈ మనుషుల్లో కొందరికి ఇతరుల ఆనందాన్ని లాక్కోవడమే ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుందనుకుంటా! అనిపించి, వారివైపు జాలిగా చూసాను.దేవుడు మనుషులను ప్రేమించడానికి మతాన్ని అనుసరించమన్నాడు, అంటే దైవానికి మతం కన్నా మనుషులంటేనే ఇష్టం కదా! మరి సాటి మనిషిని ప్రేమించిన నేను కాఫిర్ అయితే, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించే ఆ సృష్టికర్తను ఏమనాలి? నన్ను నేను సమర్థించుకోడానికి పిచ్చిగా ఆలోచిస్తున్నాను అనిపించింది.
ఇమామ్ సాబ్ గంభీరంగా అడుగులు వేస్తూ మింబర్ దిగి వెళ్లిపోయాడు. నన్ను శత్రువుగా చూసేవాళ్లు నావైపు చులకనగా చూస్తూ హేళనగా మాట్లాడుతూ..“జా.. జా.. కడే హోకర్ క్యా దేఖ్తే హై! జల్దీ జాకర్ అప్నా బేటికో ఘర్ వాపస్ లావో”(నీ బిడ్డను ఇంటికి తెచ్చుకో) అన్నారు.
మౌనంగా మిహ్రాబ్ (మక్కా దిశను సూచించే పవిత్రమైన గూడు) వైపు భక్తిపూర్వకంగా చూసి బైటికి నడిచాను.ఇంటికి వచ్చి, దుకాణం తెరిచి కూర్చున్నాను. ఒకప్పుడు బాగా నడిచిన నా సెకండ్ హ్యాండ్ బుక్స్ బేరం, ఇప్పుడు ఇంటర్నెట్ వలలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. మొబైల్ ఫోన్ కర భూషణం అయ్యాక పుస్తకం చేజారి పోయింది. ఒకప్పుడు దస్తావేజులు రాస్తే నాలుగు రాళ్లు వచ్చేవి. కంప్యూటర్ పోటీకి వచ్చి మా పొట్ట కొట్టింది. లేటు వయసులో అప్‌గ్రేడ్ కాలేక, వేరే పని చేయలేక, పరేషాన్ తప్ప రేషన్ కూడా సమకూర్చుకోలేక.. ‘ఊపర్ షేర్వానీ అందర్ పరేషాని’లా ఉన్నాయి మాలాంటి వారి బ్రతుకులు.ఇంతలో ఫోన్ మోగింది.“అస్సలాం వాలైకుమ్ అబ్బాజాన్.. ఖైరియత్!?” అంటూ కుశల ప్రశ్నలు అడిగింది ఫాతిమా.
“వాలైకుమాస్సలామ్.. బేటీ! అలహం దులిల్లా ఆప్ సబ్ కైసే హై!?” అని అడిగాను.నా గొంతులో విషాదాన్ని గుర్తించిన ఫాతిమా గుచ్చిగుచ్చి వివరాలు అడిగింది. అన్నిటికీ ఏమి లేదనే చెప్పాను. కానీ ఫాతిమా వదలకుండా..“అబ్బాజాన్! ఆప్ కో మేరీ కసం” అని నిజం రాబట్టింది.ఫాతిమా నాకు కూతురే అయినా కన్నతల్లి కన్నా ఎక్కువ. తన చిన్నతనంలోనే నా భార్య చనిపోయింది. కొంచెం ఊహ రాగానే ఇంటి పనులన్నీ బాధ్యతగా చేసేది. ఫాతిమా అంటే నాకు ప్రాణం. వాళ్లమ్మ చనిపోయాక నన్ను రెండో పెళ్లి చేసుకొమ్మని చాలామంది ప్రోత్సహించారు. ఇస్లాం చట్టం (షరియత్) ప్రకారం, ఒక ముస్లిం పురుషుడు గరిష్ఠంగా నలుగురు భార్యలను కలిగి ఉండటానికి అనుమతి ఉంది. కానీ, అది కఠినమైన నిబంధనలతో కూడుకున్నది. ముఖ్యంగా భార్యలందరి మధ్య సమానత్వం, వారిని పోషించే ఆర్థిక సామర్థ్యం, మొదటి భార్య అనుమతి తీసుకోవడం, పిల్లలందరినీ సమానంగా చూస్తూ పోషించడం వంటి అనేక నిబంధనలు పాటించాలి. నాకు మరో భార్యను, ఆమె పిల్లలను పోషించ డం కష్టం అనిపించింది. ముఖ్యంగా ఆ వచ్చే సౌతేలి మా (సవతి తల్లి) ఫాతిమాను ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనని పెళ్లి వద్దనుకున్నాను. నా దుకాణం పక్కన కొత్తగా వచ్చినవారు, పాత ఆనవాళ్లను తుడిపేస్తూ ఇంటిని మరమ్మతు చేస్తున్నారు. ఆ తుడిపే ఆనవాళ్లలో నాకెన్నో మరచిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఆ ఇంట్లో ఉండే రహీం చాచా, రాము, వాళ్ల అనుబంధం గుర్తొచ్చి, నా ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.
ట్రైన్లో పాటలు పాడుకుంటూ తిరిగే మా పక్కింటి రహీం చాచాకు, నాలుగేళ్ల వయసున్న మూగ పిల్లవాడు రాము దొరికాడు. చాచా వాడి తల్లిదండ్రుల పతా (ఆచూకీ) కోసం అన్ని రకాలుగా కోషిజ్ చేసాడు. కానీ, వాడి కోసం ఎవ్వరూ రాలేదు. తన ఒంటరి బతుక్కు అల్లా పంపిన సహారా (తోడు) అనుకొని, వాడిని తనతోనే ఉంచుకొని చాలా ఆప్యాయంగా పెంచాడు. వాడికి స్నానం చేపించడం, అన్నం తినిపించడం లాంటివన్నీ చాచానే ప్రేమతో చేసేవాడు. రాత్రుళ్లు వాడు చాచా గుండెల మీద నిద్ర పోయేవాడు. చాచాను ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు.
వాడి మెడలో వేలాడే రాముల వారి బిళ్లను చూసి, చాచా వాడిని ‘రాము బేటా!’ అని పిలిచేవాడు. వాడికి ముస్లిం పేరు పెట్టుమని నేను చాచాతో అన్నప్పుడల్లా..“నై జాఫర్ మియా! వాడు పుట్టుకతో హిందువు. వాడు పెరిగాక ఇస్లాం నచ్చితే మారుతాడు. ఒకరిని బలవంతంగానో, తెలియని స్థితిలోనో మతం మార్చడం తరీఖ కాదు. అయినా మతాలన్నీ దేవుడిని చేరడానికి వేసిన వేరువేరు దారులు మాత్రమే! అందులో ఏ దారైనా ఒకటే!” అనేవాడు.
చాచా గారాబం వల్ల రాముకు పెద్దగా చదువు అబ్బకున్నా, చాచా నీడలో క్రమశిక్షణగా పెరిగి.. వాడికి ఇష్టమైన పనిని పట్టుదలతో నేర్చుకొని మంచి బైక్ మెకానిక్ అయ్యాడు. వాడికి కొంచెం సంపాదించే శక్తి రాగానే చాచాను ఎక్కడికీ వెళ్లవద్దని, అన్నీ తానే చూసుకునేవాడు. వాడికి మాటలేవీ రాకున్నా చాచాను ‘నానా’ అని నత్తినత్తిగా పిలిచేవాడు.“దేఖో జాఫర్ మియా! ఏ ముజే నానా బోల్తాహై! వీడికి నేను తాతను” అని సంబరపడేవాడు.
చాచాకు వయసు మీద పడటంతో మనిషి వంగిపోయి, నడక తడబడేది. చేతులు, తల వణికేది.ఇంట్లో వంటా వార్పు, చాచాకు స్నానం చేయించడం, అన్నం తినిపించడం లాంటి పనులన్నీ విసుగు పడకుండా రాము స్వయంగా చేస్తూ.. చాచాను కంటికి రెప్పలా చూసుకునేవాడు. చాచా అంటే వాడికి ప్రాణం.
రాము-చాచాల అనుబంధాన్ని చూస్తే, భగవంతుడు కొన్ని బంధాలను వారివారి పుణ్యకార్యాలను బట్టి కల్పిస్తాడేమో! అనిపించేది.
రాము, ఫాతిమా కలిసి పెరిగిన కారణంగా మంచి దోస్తులయ్యారు. పండుగలకు పబ్బాలకు చాచాతోపాటు మాకు కూడా కొత్త బట్టలు, ఫాతిమాకు ఇష్టమైన అలంకరణ వస్తువులు ఇద్దరూ కలిసి వెళ్లి ఖరీదు చేసేవాళ్లు. పండుగను అందరం కలిసి జరుపుకొనేవాళ్లం. అప్పుడప్పుడు చాచా ఫాతిమాతో..“రాము మాసూమ్ (అమాయకుడు) లడకా హై బేటీ! ఉన్ పర్ ఖయాల్ రక్నా” అని చెపుతుండే వాడు. కొన్నాళ్లకు మా పక్కనుండే రహీం చాచా ఇంటిముందే మెకానిక్ షాప్ పెట్టాడు రాము. వాడి పనితనం, మంచితనం కారణంగా షెడ్డు బాగా నడిచేది.నెలపొడుపుతో రంజాన్ నెల ప్రారంభం అయ్యింది. రంజాన్ నెల ముస్లింలకు పవిత్రమైనది. ఈ నెలలోనే ముహుమ్మద్ ప్రవక్తకు, దేవదూత ద్వారా ఖురాన్ దివ్యగ్రంథ ఆవిర్భావ ప్రక్రియ ప్రారంభమైంది.
రహీం చాచా రంజాన్ నెల మొత్తం కచ్చితమైన ఉపవాస దీక్ష చేసేవాడు. నడవడం కొంచెం కష్టం కనుక ఇంట్లోనే నమాజ్ చేసేవాడు. శుక్రవారం ఇఫ్తార్ (రోజా విడిచే సమయం)లో మగ్రిబ్ నమాజ్‌కు మాత్రం రాము సహాయంతో మసీద్‌కు వచ్చేవాడు.రంజాన్ మాసపు ఇరవై ఏడవ రోజున షబా యే ఖదర్ అని పిలిచే పవిత్రమైన రాత్రి, ఇది వేయి రాత్రుల కంటే శ్రేష్ఠమైనదిగా నమ్ముతారు. ఈ రాత్రి ప్రార్థనలు, దైవారాధన ద్వారా అల్లాహ్ అనుగ్రహం, క్షమాపణలు లభిస్తాయని, రాబోయే సంవత్సరానికి విధి నిర్ణయమవుతుందని విశ్వసిస్తారు. ఆ రోజు రాత్రంతా
మసీదులో, నేను రహీం చాచా ప్రార్థనలు ముగించుకొని ఇంటికి వచ్చాం.ఉదయం నేను దుకాణం తీద్దామని అనుకుంటుండగా రాము హైరానా పడుతూ వచ్చి, ఏడుస్తూ నా చేయి పట్టుకొని వాళ్ల ఇంట్లోకి తీసుకెళ్లాడు. నా మనసేదో కీడు శంకించింది. వెళ్లి చూస్తే రహీం చాచా మంచంలో పడుకొని ఉన్నాడు. నేను గట్టిగా పిలిస్తే బరువుగా వాలిపోతున్న రెప్పలను బలవంతంగా తెరిచాడు. ఏడుస్తున్న రామును దగ్గరికి పిలిచి.. వాడి చేతిని నా చేతిలో ఉంచి నావైపు చూశాడు. ఏదో చెప్పాలని తాపత్రయ పడుతున్నా.. గొంతు పెగలలేదు. కానీ ఆ చూపులో రామూ గురించి చెప్పాలనుకున్న వంద పేజీలకు సరిపడే భావం వ్యక్తమయ్యింది. చివరికి రెండు కన్నీటి బొట్లు జారుతుండగా ఎన్నో భావాలను, ఎంతో కరుణను, ప్రేమను, ఆరాధనను, దుఃఖాన్ని, సంతోషాన్ని వ్యక్తీకరించినఆ కళ్లు.. భావ శూన్యమై శాశ్వతంగా మూతపడ్డాయి.
రాము సహాయంతో చాచా శరీరాన్ని శుభ్రం చేసేటప్పుడు వాడు ఏడుస్తూనే చాచా మలమూత్రాలను శుభ్రం చేస్తుంటే.. ఎంతో పుణ్యం చేస్తేతప్ప ఇలాంటి ఉత్తముడైన కొడుకు దొరకడేమో అనిపించింది. బట్టలు మార్చి ఖిబ్లా (మక్కా) వైపు చూసేలా చాచాను పడుకోబెట్టి, ఇంట్లోని తెల్లని వస్త్రాన్ని చాచా మీద కప్పి ప్రార్థన చేసాను.ఎంతో పుణ్యం చేస్తే తప్ప రంజాన్ నెలలో మరణం రాదంటారు. ఇలాంటి మరణం దైవ ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ నెలలో దైవ గృహపు తలుపులు తెరచి ఉండి, మరణించిన వారికి జన్నత్ (స్వర్గం) ప్రాప్తి కలుగుతుందని, ముఖ్యంగా ఉపవాస దీక్షలో ఉండి మరణిస్తే వారికి అల్లాహ్ దీవెనలు లభించి వారి పాపాలు క్షమించబడి, వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఖురాన్ చెబుతోంది.
అందరితో మాట్లాడి అసర్ నమాజ్ కల్లా రహీం చాచా అంత్యక్రియలు పూర్తి చేయాలనుకున్నాం. రామును ఓదార్చే బాధ్యత చూడమని ఫాతిమాకు చెప్పాను.
బతికుండగా ఎన్ని సేవలు చేసినా.. ఈ ఆఖరు సేవలకు షరియత్ నిబంధనల ప్రకారం రాము అర్హుడు కానందున, మత పెద్దల సహకారంతో రేగి ఆకులు మరిగించిన నీటితో గుసుల్ (ఆఖరి పవిత్ర స్నానం) చేయించి, తెల్లని వస్త్రాలతో కఫన్ సిద్ధం చేసి, కళ్లకు సుర్మా దిద్ది, ఆఖరు చూపులు అయ్యాక డోలాలో మసీద్‌కు తీసుకు వెళ్లి, జనాజా నమాజ్ అయ్యాక, ఖబరస్తాన్‌లో దఫన్ చేసి ఇంటికి వచ్చాం. ఆ ఖర్చంతా నా ద్వారా రామునే పెట్టాడు.చాచా ఎడబాటుతో రాము చాలా కుంగిపోయాడు. చాచా ఇకలేడు, రాడన్న నిజాన్ని వాడు తట్టుకోలేక పోతున్నాడు. ఎందుకంటే వాడికి ఊహ వచ్చాక తల్లి, తండ్రి, దోస్త్ అన్నీ చాచానే! గోరు ముద్దలు తినిపించి, వీపు మీద గుర్రమెక్కించుకొని ఆడించిన చాచాను వాడు మరువలేక పోతున్నాడు. రాత్రుళ్లు ఉలిక్కిపడి లేచి ‘నానా’ అని పిలుస్తూ ఏడ్చేవాడు. ఆ స్థితిలో ఫాతిమా వాడికి తోడుగా నిలబడి ఓదార్చి, బలవంతంగానో, బతిమాలో తినిపించేది. రాము కూడా ఫాతిమాకు ఎదురు చెప్పేవాడు కాదు. ఫాతిమా సహచర్యంతో మెల్లమెల్లగా రాము తేరుకున్నాడు.
మా కాలనీలో ఉండే చుట్టాల ద్వారా ఫాతిమాకు పైగాం (పెళ్లి సంబంధం) వచ్చింది. అబ్బాయి సౌదీలో ఉంటాడు. మంచి స్థితిమంతుడు. మొదటి భార్య చనిపోయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్లు ఫాతిమాను చేసుకుంటామని అడిగారు. పెళ్లి విషయంలో ‘ఆప్కీ మర్జీ అబ్బాజాన్!’ అని చెప్పినా.. ఎందుకో ఫాతిమా సంతోషంగా లేదనిపించింది.
“బేటీ నువ్వు నిఖాకు సిద్ధంగా లేవా? లేక ఈ సంబంధం ఇష్టం లేదా?” అడిగాను.ఫాతిమా మౌనంగా ఉండిపోయింది.పెళ్లి అనగానే నా కాళ్లు, చేతులు ఆడలేదు. జానెడు పొట్ట నింపడానికే సతమతమయ్యే నేను.. ఈ పెళ్లి ఎలా చేయడం? షాదీఖానా, బంగారం, బట్టలు, ఇచ్చే సామాన్లు, దావత్ ఖర్చులు.. కమ్ సే కమ్ నాలుగైదు లక్షలన్నా కావాలి. లెక్కలు చూస్తే నాకు చుక్కలు కనిపించాయి. కానీ, తప్పదు. ఖుదా మీద భరోసా పెట్టి, తెలిసిన వారి దగ్గర అప్పుకోసం ప్రయత్నించాను. ఎక్కడా పైసా పుట్టలేదు. నా దుకాణం అమ్మితే తప్ప పెళ్లి చేయలేనని అనుకుని.. ఆ
ప్రయత్నాలు మొదలుపెట్టాను.కానీ, ఫాతిమా వెళ్లిపోతే నాకెవరున్నారు? నన్ను చూసేదెవరు? రేపటిగాల భీమారిల (అనారోగ్యం) పడితే నా గతేం కాను? ఈ దుకాణం కూడా పోతే నా పరిస్థితి ఏంటి?.. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే! కానీ, తప్పదు.
ఒకరోజు రాము ఎనిమిది లక్షలు తెచ్చి నా చేతిలో పెట్టాడు.“ఏంట్రా ఇది?” అని అడిగాను.ఫాతిమా నిఖా కోసం షెడ్డు అమ్మానని, తన దగ్గర దాచిన డబ్బులు కలిపి తెచ్చానని ఇషారా (సంజ్ఞ)ల ద్వారా చెప్పాడు.ఎంత గొప్ప మనసు వీడిది. మా కులం కాదు, తలం కాదు.. ఏమై పోతానోనన్న ధ్యాస కూడా లేకుండా, తన దగ్గర ఉన్నదంతా దానం చేయగలిగిన నిస్వార్థమైన, నిజమైన నిలువెత్తు మంచి మనిషిని ఆశ్చర్యంగా చూసాను.
“నాకెందుకు రా! వద్దు!” అన్నాను.బలవంతంగా చేతిలో పెట్టి, వద్దనవద్దని నా చేతిని వాడి తలపై పెట్టుకొని ఒట్టు వేయించుకున్నాడు. నా కళ్లు వర్షిస్తున్నాయి. మసక బారిన నా కంటి వెలుగులో ఆకాశమంత ఎదిగిన పైగంబర్ (దేవదూత)లా కనిపించాడు రాము.ఇదంతా చూసిన ఫాతిమా ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లింది.“వెళ్లి ఫాతిమాను తీసుకు రా” అని రాముకు చెప్పాను.రామును చూడగానే ఫాతిమా వాడిని గట్టిగా చుట్టుకొని ఏడ్చింది. వాడు కూడా తట్టుకోలేక పోతున్నాడని అర్థమైంది.రాము వెనక్కి తిరుగుతుంటే.. ఫాతిమా వాడి చెయ్యిని గట్టిగా పట్టుకుంది. ఫాతిమా చాలా
నిబ్బరంగా, ధైర్యంగా తన మనసులోని ఇష్టాన్ని అప్రయత్నంగానే వ్యక్తం చేసింది.నేను, ఫాతిమా దగ్గరికి వెళ్లి..“నీ మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పు బేటీ! ఆప్ కో మేరీ కసం, జూట్ నై బోల్నా!” (అబద్ధం చెప్పొద్దు) అన్నాను.
ఫాతిమా ఏడుస్తూ..“అబ్బాజాన్! మీరు నాకోసం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మీకు వయసు కూడా మీద పడింది. నేను వెళ్లిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడే కదా మీకు నా అవసరం!” అని నన్ను పట్టుకొని బాగా ఏడ్చింది.రాము కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు.
“లేదు బేటీ! నా స్వార్థం కోసం నీకు పెళ్లి చేయకుంటే, ఆ దేవుడు నన్ను క్షమించడు” అన్నాను.“అబ్బాజాన్! ఈ స్థితిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను సంతోషంగా ఉండలేను, బిచారా రామూకా హాలత్ క్యా హోగా” (రాము ఏమైపోతాడు) అన్నది.“బేటీ.. వాడి బతుకు వాడిది. రామూసే హమే క్యా లేనా దేనా హై!?” అన్నాను కావాలనే.“రాము జిమ్మేదారీ చాచా మీకే అప్పగించాడు. మీ దగ్గర డబ్బులు లేవని, నా నిఖా కోసం రామూ ఉన్నది అమ్మి మీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు రాము ఎక్కడుంటాడు? ఎక్కడికి పోతాడు? చాచా కా వాదా నిభానా ఆప్కా ఫర్జ్ నై హోతా!” (చాచాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీ బాధ్యత కాదా!) అన్నది.
నా మనసులోని సందేహపు పొరలు తొలగి పోయాయి. అయినా ముక్కూ మొఖం తెలియని ఎవరికో నా బిడ్డను ఇవ్వడంకంటే.. కళ్లముందు కనిపించే మేలిమి బంగారంలాంటి ఉత్తముడైన రాము సహచర్యంలో ఫాతిమా సంతోషంగా ఉంటుంది అనిపించింది. నా మనసులో నాటుకున్న కులమతాల అడ్డుగోడలను నా బిడ్డ మీదున్న ప్రేమ కూలదోసింది. నా కోసం, తనకోసం ఫాతిమా నిర్ణయాన్ని స్వాగతించాను. అల్లాహ్ సాక్షిగా రాము చేతిని ఫాతిమా చేతిలో పెట్టి..“అబ్ మేరా ఫర్జ్ పూరా హోగయా.. బేటీ! అబ్ సే ఏ అమానత్ ఆప్ కా హై (ఇక రాము బాధ్యత నీదే) రాము ఆప్ కా మెహర్ (పెళ్లిలో వధువుకు ఇచ్చే బహుమానం) బీ దేదియా హై!” అన్నాను, రాము ఇచ్చిన డబ్బు ఫాతిమా చేతిలో పెట్టి.మంచితనం-మానవత్వం ఒక వైపు, మతాల సంకెళ్లు మరోవైపు.. ఇది నాకు కఠిన పరీక్షా సమయమే! ఈ పరీక్షను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అల్లాహ్‌ను ప్రార్థించాను.సృష్టికర్త దృష్టిలో మానవులంతా సమానమే! ఎవరైతే ఆయనకు లోబడి, ఆయన మెచ్చేవిధంగా నీతిపరులై జీవిస్తారో.. వారిపై అపార కరుణను కురిపిస్తాడు.
వేషధారణ కారణంగానో, నీతి బోధనల కారణంగానో, ఆయనకు ఎవ్వరూ దగ్గరకాలేరు. మంచిని ఆచరించే నీతిమంతులను మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు.
ఈ తర్కం ద్వారా నా అంతరాత్మను, వారిద్దరినీ ఒకటి చేయడానికే నన్ను నేను సమర్థించుకుంటున్నాను అనిపించింది. కానీ, రామును పెంచడానికి చాచాకు, చాచాను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి రామూకు అడ్డుచెప్పని మతం.. ఇప్పుడు రాము-ఫాతిమా ఒకటి కావడానికి అడ్డు కావొద్దని, వారి పెళ్లి ఒక చర్చలా మారి విపరీతాలకు దారి తీయొద్దని, ఓర్చుకోలేని వారికి దూరంగా ఉంటేనే క్షేమమని, ఎక్కడ వారు సంతోషంగా ఉండగలరో అక్కడికి వెళ్లండని చెప్పి దీవించాను.“అబ్బాజాన్! నేను మిమ్మల్ని వదిలి వెళ్లలేను. ఈ పెళ్లి మీకు దూరం చేసేదే అయితే, అసలు నాకు పెళ్లే వద్దు!” అని జిద్దు చేసింది ఫాతిమా. రాముకూడా వెళ్లనన్నాడు.ఇద్దరినీ సమ్జాయించి, ఇక్కడి పరిస్థితులు చక్కబడ్డాక దుకాణం అమ్మి, నేను కూడా వాళ్ల దగ్గరకే వచ్చి వాళ్లతోనే ఉంటానని కసం (ఒట్టు) పెట్టుకున్నాక.. వాళ్లు వెళ్లడానికి సమ్మతించారు.ఫాతిమా దక్కలేదన్న కోపంతో, ఈ సంబంధం తెచ్చిన బంధువులు నా మీద కక్షగట్టి, విషం కక్కుతూ ఉన్నవి లేనివి చాడీలు చెప్పి.. ఈ విషయాన్ని మతంతో ముడిపెట్టి, నేను కాఫిర్ (ద్రోహి)నని బద్నామ్ చేస్తూ, బస్తీ ముసల్మాన్ పెద్దలకు, ఇమామ్ సాబ్‌కు ఫిర్యాదు చేశారు.
కానీ, ఒకే నేలతల్లి మీద బతుకుతూ స్నేహితుల్లా, బంధువులుగా ఉండాల్సిన మనుషుల్లో మత వైషమ్యాలతో విషం నిండితే దేశానికి, సమాజానికి మంచిదికాదనే దూర దృష్టితోనే.. చరిత్రలో ఎందరో రాజులు, మత సామరస్యం కోసం పరమత వివాహాలు చేసుకున్న దాకలాలు కోకొల్లలు. ఆనాటి అక్బర్ పాదుషా రాజపుత్ర వంశానికి చెందిన జోధా భాయిని, మహారాజా ఛత్రసాల్ హైదరాబాద్ నిజాం కూతురు రుహానీ బాయిని పెళ్లిచేసుకొని మత సామరస్యాన్ని పెంపొందించారు. దీనిని ప్రజలు, మతాధిపతులు ఆమోదించారు. నేటి సమాజంలో కూడా చాలామంది గొప్పవాళ్లు, అన్యమత వివాహలు చేసుకుంటున్నా.. వారిని ఎవ్వరూ వేలెత్తి చూపడం లేదు.
ఇక్కడ ప్రశ్నించే వాళ్ల జబర్దస్తీ, జులూమ్ అంతా మాలాంటి పేదవాళ్ల మీదనే. షరియత్ ఉల్లంఘన తప్పే కావచ్చు.. మనిషిని, మంచిని, మానవత్వాన్ని ప్రేమించడం తప్పుకాదు. అయినా వాళ్లిద్దరి ప్రేమను కాదనడానికి ఎవరికీ ఏ హక్కూలేదు. తండ్రిగా నాకు లేని ఇబ్బంది వేరేవాళ్లకు ఎందుకు? నన్ను నేను సమర్థించుకోవడానికి నా పాత పుస్తకాల పఠనా జ్ఞానం బాగానే వాడుకుంటున్నానని అనిపించింది.
అయినా ఇక్కడ మనుషులు అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పాల్సిన పనిలేదు. నేను కాఫిర్ అయితే.. అల్లాహ్ న్యాయస్థానంలో నేను తప్పకుండా జవాబు చెప్పాల్సిందే! నేను తప్పు చేస్తే దోషిగా నాకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఇది సమర్థన కాదు. అనంత కరుణామయుడు, అపార కృపా సంపన్నుడు అయిన ఆ సృష్టికర్త అల్లాహ్ పట్ల నాకు గల విశ్వాసం.
“అబ్బాజాన్! ఈ స్థితిలో మిమ్మల్నిఒంటరిగా వదిలి నేను సంతోషంగా ఉండలేను, బిచారా రామూకా హాలత్ క్యాహోగా” (రాము ఏమైపోతాడు) అన్నది.“బేటీ.. వాడి బతుకు వాడిది. రామూసే హమే క్యా లేనా దేనా హై!?” అన్నాను కావాలనే.“రాము జిమ్మేదారీ చాచా మీకే అప్పగించాడు. మీ దగ్గర డబ్బులు లేవని, నా నిఖా కోసం రామూ ఉన్నది అమ్మి మీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు రాము ఎక్కడుంటాడు? ఎక్కడికి పోతాడు? చాచా కా వాదా నిభానా ఆప్కా ఫర్జ్ నై హోతా!”(చాచాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంమీ బాధ్యత కాదా!) అన్నది.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ద్వితీయ బహుమతి రూ.25 వేలు పొందిన కథ.
-సుదర్శనం రంగనాథ్
98662 65630