తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీరాణి, లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరాన్ని ( Medical Camps) నిర్వహించారు. సర్పంచ్ ముడిమడుగుల సురేష్ ( Sarpanch Suresh ) వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
14 సంవత్సరములు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేయించుకుని గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని సూచించారు. వైద్యులు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా గ్రామపంచాయతీ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జీవనశైలి మార్పులతో వచ్చే వ్యాధులను దూరం చేసుకోవడం కోసం యోగా, ఎక్సర్ సైజులు చేయాలని సూచించారు.
ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి, కళ్యాణ్, శిల్పా, తారక్, జనరల్ మెడిసిన్ వైద్యులు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో 291 మంది పేషెంట్లను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ, నాయకులు ఎండీ ఈసా, వార్డు సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.