రెబ్బెన, జనవరి 5 : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటనను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, పీఏసీఎస్ ఛైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గోలేటి, రెబ్బెనలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాల్లో వారు మాట్లాడారు. కల్వకుంట్ల కవితకు మండలంలో బైక్ ర్యాలీతో స్వాగతం పలికి, గోలేటిలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొనున్న తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులకు అందించిన సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆమె మాట్లాడటంతో పాటు, గత ఎన్నికల్లో సర్కారు ఇచ్చిన హామీలు, గుర్తింపు కార్మిక సంఘం ఇచ్చిన హామీలు, ఇతర సమస్యలపై కార్మికులతో చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హాజరుకానున్నట్లు చెప్పారు. బెల్లంపల్లి ఏరియా, రెబ్బెన మండలంలోని టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావ్, మాజీ ఎంపీటీసీ కడతల మల్లయ్య, మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, మాజీ కోఆప్షన్ మెంబర్ జౌరుద్దీన్, నాయకులు మాంతు సమ్మయ్య, బొంగు వెంకటేశ్, అక్కేవార్ దయాకర్, పందిర్ల మధునయ్య, అన్నపూర్ణ మురళీగౌడ్, దుర్గం భరద్వాజ్, దామోదర్, వెయిగండ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడిలో పర్యటన..
వాంకిడి, జనవరి 5 : వాంకిడి మండలానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ అజయ్‌కు మార్ తెలిపారు. మండలంలోని ధాబా గ్రామానికి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబానిన పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, స్వాగత ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారాం, పీఏసీఎస్ చైర్మన్ జబోరే పెంటు, మాజీ సర్పంచ్ సయ్యద్ ఆయూబ్, పీ వినోద్, బండే బలేశ్, కే వినోద్ తదితరులున్నారు.
బైక్ ర్యాలీకి సహకరించాలి..
సిర్పూర్(యూ), జనవరి 5 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాక సందర్భంగా కార్యకర్తలు నిర్వహిస్తున్న బైక్ ర్యాలీకి సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తొడసం ధర్మారావ్ కోరారు. ఈ మేరకు పోలీస్టేషన్లో ఎస్ఐ రామకృష్ణను మార్యద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. కల్వకుంట్ల కవిత జిల్లాకు వస్తున్న సందర్భంగా మండలంలోని పదిహేను గ్రామ పంచాయతీల నుంచి గ్రామానికి 10 చొప్పున మొత్తం 150 బైక్‌లతో ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. కాగా పోలీసుల సహకారం ఉండాలని కోరారు. ఎస్ఐ మాట్లాడుతూ.. ఇబ్బందులకు గురికాకుండా శాంతియుతంగా ర్యాలీ తీయాలని సూచించారు. పార్టీ నాయకులు కోవ నాందేవ్, పెందోర్ అర్జు పాల్గొన్నారు.