దిలావర్పూర్, మార్చి 30 : నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 42,597 మంది రైతులు తమ భూముల్లో 87,664 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పంట చేతికొచ్చింది. అత్యధికంగా ముథోల్ నియెజకవర్గం, ఖానాపూర్లో అత్యల్పంగా సాగు చేస్తున్నారు. పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు అమ్మి నష్టపోతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్క్ఫెడ్, ఇతర సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసింది. ప్రస్తుతం రైతులు ఒక క్వింటాలుకు దాదాపు రూ.200లకు పైగా నష్టపోవడంతోపాటు, వారు చెప్పిన తేదీకే పైసలు ఇస్తామని చెప్పి రైతుల వద్ద నుంచి మక్కలను కొనుగోలు చేస్తున్నారు.
నేను 1.20 ఎకరాల్లో మక్క వేశా. మంచి దిగుబడి వచ్చింది. సర్కారోళ్లు కొనుగో లు కేంద్రాలు ఏర్పా టు చేయకపోవడం తో దళారులకు అమ్ముకున్న. నెల తరువాత డబ్బులు ఇస్తామన్నారు. సరే అని అమ్మివచ్చా. అనుకున్న ధర వస్తే బాగుండేది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉంటే క్వింటాలుకు రెండు, మూడు నూర్లు ఎక్కువ వస్తుండే.
– పోతన్న, రైతు, న్యూ లోలం.
ఈ యాసంగిలో నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. రెండెకరా ల్లో మక్కను కోసి తక్కువ ధరకు అమ్ముకున్నా. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో క్వింటాలుకు రూ.200 వరకు తక్కువకే ఇచ్చివేసిన. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దళారులకు మక్కలన్నీ అమ్మిన తరువాత ఏర్పాటు చేస్తే ఏం లాభం ఉండదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే దళారులు కూడా ధర పెంచుతారు. లేకుంటే వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది.
– చిన్నరెడ్డి, రైతు.