మక్కరైతు బిక్కుబిక్కు
మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిసి మొలకెత్తిన మొక్కలను చూపిస్తూ.. మళ్లీ వర్షం వస్తే మా పరిస్థితి ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొంటామన్న సర్కారు
- మద్దతు ధర లభిస్తుందని ఆశపడితే.. ప్రైవేటుకు విక్రయించే దుస్థితి..
- మంచిర్యాల జిల్లాలో 20 రోజులుగా కొనుగోలు చేయని అధికారులు
- వర్షానికి తడిసి రంగు మారిన మొక్కజొన్న.. పలుచోట్ల మొలకలు..
మంచిర్యాల, మే 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిసి మొలకెత్తిన మొక్కలను చూపిస్తూ.. మళ్లీ వర్షం వస్తే మా పరిస్థితి ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడవడంతో ఇప్పటికే మొక్కజొన్న రంగు మారిందని, కొంత భాగం పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట తెచ్చి కల్లాల్లో పోసుకొని 20 రోజులు అవుతున్నదని, ఇప్పటి వరకు కొనుగోళ్లు చేపట్టలేదని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన దగ్గరకు పంటను తీసుకురావద్దని, మీకు ఎక్కడ వీలుంటే అక్కడే పోసుకుంటే నేరుగా మీ వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి.. తీరా మొక్కజొన్న పోసుకొని 20 రోజులు పూర్తికావస్తున్నా తూకం వేసిన నాథుడే లేడన్నారు. మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలుకు మార్క్ఫెడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని పోన్కల్, దండేపల్లి నెల్కివెంకటాపూర్.. లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్.. హాజీపూర్ మండలంలోని గుడిపేట.. వేమనపల్లి మండలంలో మొత్తం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 533 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, 7628 మెట్రిక్ టన్నుల పంట సేకరణ లక్ష్యం పెట్టుకున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం నాటిని 19,665.50 క్వింటాళ్ల పంటే కొనుగోలు చేశారు. వేమనపల్లి 8500, జన్నారంలో 3512, దండేపల్లిలో 6336, లక్షెట్టిపేటలో 532, హాజీపూర్లో 785 క్వింటాళ్లు ఇప్పటి వరకు సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కొనుగోళ్లు మొదలై దాదాపు మూడు వారాలు పూర్తి కావస్తున్నా.. ఆశించిన స్థాయిలో సేకరణ జరగకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Adi
మద్దతు ధరకు ఆశపడితే.. మొదటికే మోసం..
వరికి బదులు ప్రత్యామ్నాయ సాగు చేయాలని చెప్పడంతో గతంలో పోలిస్తే ఈ సీజన్లో జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. పోయిన ఏడాది ప్రైవేటు దళారులు క్వింటాలుకు రూ.2200 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈసారి డిమాండ్ ఎక్కువ ఉంటుందని రైతు భావించారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2400 ప్రకటించడంతో ప్రైవేటుకు విక్రయించకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
మక్క కల్లాల్లో పోసి 20 రోజులు పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. గతేడాది ప్రైవేటులో రూ.2200 ఇచ్చినోళ్లు, ఇప్పుడు ఒక వర్షం పడడంతో క్వింటాలుకు రూ.1650, రూ.1700లకే అడుగుతున్నారని, మరో వర్షం పడితే రూ.1500 క్వింటాలు అడిగినా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదంటూ బాధపడుతున్నారు. ఎక్కువ ధర వస్తున్నదని నమ్మకంతో వస్తే 20 రోజులుగా పంటను తూకం వేయకుండా మా గోస పంచుకుంటున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఎక్కువ ధర వస్తే ఖర్చులు మేరకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడితే మొదటికే మోసం వచ్చిందంటూ రైతులు బోరుమంటున్నారు.
రాత్రి, పగలు కావలి కాస్తున్నా..
మద్దతు ధర వస్తుందని ఆశపడి మొక్కజొన్న తెచ్చి టీకన్నపల్లిలో పోసినం. 20 రోజులు అవుతుంది. కానీ ఏ ఒక్క రైతు పంట తూకం వేయలేదు. పది రోజుల క్రితం వచ్చి కొందరి పంట తూకం వేశారు. బస్తాల్లో నింపి అలాగే కల్లాల్లోనే పెట్టారు. ఇంతవరకు తూకం వేసిన పంట లిఫ్ట్ చేయలేదు. పంట కొనుగోలు చేయక, కొన్న పంటను తరలించక పగలు, రాత్రి తేడా లేకుండా కల్లాల్లోనే కావలి కాస్తున్నాం. సాయంత్రం పరదాలు కప్పుడు, ఉదయం తీసి ఆరబెట్టుడు. రోజూ ఇదే జరుగుతుంది. గతేడాది రూ.2200 క్వింటాలు చొప్పున మా చేల వద్దకే వచ్చి ప్రైవేటు దళారులు కొనుగోలు చేశారు. ఇప్పుడు చేను నుంచి ఇక్కడికి తెచ్చేందుకు రూ.1000 ఖర్చు అయ్యింది. మద్దతు ధర వస్తుందనుకుంటే తెచ్చిన పంట వర్షానికి తడిసి నాశనమైంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేపట్టాలి. – ఒరగంటి తులసయ్య, టీకన్నపల్లి
మద్దతు ధర రూ.2400 అని వచ్చా..
మాది ధర్మారం. ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన. పోయిన ఏడాది ప్రైవేటుకు అమ్మితే రూ.2వేలు వచ్చింది. ఈసారి క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ఇస్తామన్నారని తెచ్చి వడ్లు కొనుగోలు కేంద్రం సమీపంలో పోసుకున్నా. పది రోజులు అయిపోయినా వచ్చి చూసినోళ్లు లేరు. కొంటరో కొనరో తెలియడం లేదు. మొన్న పడిన వర్షానికి పంట తడిసింది. రాగడి నెలలో పోయడంతో కింద నుంచి పచ్చి వస్తుంది. దీంతో మొక్కజొన్న రంగుమారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటూ పంటను ఆరబెట్టుకుంటున్నా. ఇప్పటికైనా వెంటనే కొనుగోలు చేయాలి.
– రావుల ప్రశాంత్, సబ్బేపల్లి(ధర్మారం)
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- farmers
- maize
- maize crops
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

