మంచిర్యాల, నవంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవి చూసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక చేసిందేమి లేకపోయినా.. ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చెప్పిన మాటలకు మహారాష్ట్ర ఓటరు నమ్మలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్ర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కూడా ఓట్లను కొల్లగొట్టాలని భావించింది.
ఏఐసీసీ ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీసీసీ డెలిగేట్స్ అంతా కలిసి ప్రచారానికి ఎగబడ్డారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పోటీ పడ్డారు. నాందేడ్ లోక్‌సభకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌ను ఇన్చార్జిగా నియమించారు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల హామీల్లోని ఆంతర్యాన్ని మరాఠాలు గుర్తించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల సరఫరా, ఇబ్బందుల్లేని వ్యవసాయ రంగాన్ని చూసిన మహారాష్ట్రవాసులు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇవేవి కనిపించకపోవడంతో ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన రీతిలో కర్రు కాల్చి వాత పెట్టారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ప్రచారం చేసిన నిర్మల్ జిల్లా పొరుగున ఉన్న నియోజకవర్గాలైన బోకర్, నయాగాంలోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు.
హస్తం పార్టీకి గుణపాఠం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్కనున్న మహారాష్ట్ర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. (బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్)) పార్టీల కలయికతో ఏర్పడిన మహాయుతి సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా పక్కనున్న అర్ని, కిన్వట్, నిర్మల్ జిల్లా పక్కనున్న బోకర్, నయాగాం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో కలిసి సరిహద్దు పంచుకుంటున్న అహేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానంతో నిలిచింది.
ఆసిఫాబాద్ పక్కనున్న చంద్రాపూర్ నియోజకవర్గంలోనూ హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు. తెలంగాణకు పశ్చిమ దిక్కున మహారాష్ట్రలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న నాందేడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక్కడ రాహుల్‌గాంధీతోపాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆశించిన ఫలితం రాలేదు. ప్రధానంగా ఇక్కడ ఉండే తెలంగాణ ప్రజలు(తెలుగు మాట్లాడే వారు) కాంగ్రెస్ నాయకుల హామీలకు కరగలేదు. ఈ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ హస్తం పార్టీ ఖాత తెరవలేదంటే.. తెలంగాణ ప్రభావం ఈ ఎన్నికలపై ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ హామీలు నమ్మలేదు..
కాంగ్రెస్ నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా ఇక్కడి ప్రజలు నమ్మలేదు. మహారాష్ట్రలో ఇప్పు డున్న కూటమి పాలన బాగుంది. ప్రజలకు మంచి సౌకర్యాలు అందుతున్నాయి. కాంగ్రెస్ వాళ్లు 11 నెలల్లో తెలంగాణలో చేసింది ఏం లేదు. మా దగ్గరికి వచ్చే రైతులు, ప్రజలు ఎంత బాధపడుతుంటారో కల్లారా చూశాం. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో మా పాలన బాగుందని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పిన మాటలు నమ్మలేదు.
– గేడాం మానిక్, హిరాపూర్, కిన్వట్ నియోజకవర్గం.
తెలంగాణలో మోసం చేశారు..
అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెసోళ్లు మోసం చేశారు. గ్యారెం టీలు అమలు చేశామని, ఇచ్చిన హామీలు నిల బెట్టుకున్నామని అబద్ధాలు చెప్పారు. ఆ మాట లు మా దగ్గర ఎవరూ నమ్మలేదు. అందుకే కాంగ్రెస్ కూటమికి ఓట్లు వేయలేదు. నాం దేడ్ పార్లమెంట్ పరిధిలోని ఏ అసెం బ్లీలోనూ వాళ్లకు ఓట్లు వేయలేదు. గతంలో బంగారంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడు తుంది. అలాంటి రోజులు మా దగ్గర రావొద్దు.
– రాజు, బోకర్ నియోజకవర్గం.