నిర్మల్, మార్చి 27(నమస్తే తెలంగాణ) : లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎల్) గడువు మరో రెండు రోజులే మిగిలి ఉన్నది. దరఖాస్తుదారులు తమ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈనెల 30వ తేదీ వరకు గడువు విధించింది. అయితే అధికారుల హడావుడి, అనాలోచిత చర్యల కారణంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అంతా అయోమయం, గందరగోళంగా మారింది. ఖజా నా నింపుకోవాలనే క్రమంలో అధికారుల తొందరపాటుతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు దశల్లో జరగాల్సిన ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు దరఖాస్తుల తీరు మారుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే సర్వే నంబర్లో ఒకరికి ఎల్ఆర్ఎస్ అప్రూ వ్డ్ రాగా, మరో దరఖాస్తుదారుడికి అదే సర్వే నంబర్లోని స్థలం ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నదని ఆన్లైన్లో కనిపిస్తున్నది. దీంతో కొందరు తమ విలువైన స్థ లాలను ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సరైన స ర్వే చేయకుండానే చాలా మంది స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదరాబాదరాగా నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. మరో రెండు రో జులే గడువు ఉన్నా దరఖాస్తుల్లో పురోగతి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాట్లను క్రమబద్ధీకరించి సొ మ్ము చేసుకోవాలనే లక్ష్యంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను తెరమీదికి తెచ్చిందని సామాన్యులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎ స్ చేస్తామని చెప్పి ఇప్పుడు లక్షల రూపాయలు దండుకోవడంపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. డబ్బులు చెల్లించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అధికారులు అప్డేట్ చేస్తున్నారు. డబ్బు లు చెల్లించిన సంబంధిత దరఖాస్తుల పురోగతి(స్టేటస్) గందరగోళంగా మారింది.
వాస్తవానికి ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో వడపోసిన తర్వాత సదరు దరఖాస్తుదారుడికి ఫీజు చెల్లించాలన్న సమాచారం చేరవేయాలి. కానీ.. అధికారుల తొందరపాటు కారణంగా సమీపంలో లేని ప్రభుత్వ భూములు, చెరువు స్థలాలకు సంబంధించిన సర్వే నంబర్లను పట్టా భూముల్లో చేర్చడంతో అవి కాస్త ప్రొహిబిటెడ్ జాబితాలో చేరిపోయాయి. వీటిపై ముందుగా పరిశీలించకుండానే ఫీజులు చెల్లించాలని దరఖాస్తుదారులపై ఒత్తిడి చేస్తుండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ఫీజు కట్టిన తర్వాత రెండు, మూడో దశ పరిశీలనలో స్థలంపై ఏదైనా వివాదం ఉంటే అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన ఫీజు తిరిగి వాపసు వస్తుందో లేదోనన్న అయోమయంలో దరఖాస్తుదారులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 96లో ఓ వ్యక్తి 1573 గజాల ఖాళీ స్థలాన్ని ఎనిమిదేండ్ల కింద కొనుగోలు చేశాడు. అయితే ఆ వెంచర్ జీపీ లే అవుట్లలో ఉం దని చెప్పడంతో గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో 19-10-2020 లో ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వా రు పూర్తి ఫీజు చెల్లించి తమ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించి, ఈ నెల 30 వరకు గడువు విధించింది. దీంతో సదరు వ్యక్తి ఈ నెల 10 రూ.2.15 లక్షలను ప్రభుత్వానికి చెల్లించాడు. అయితే ఇందుకు సం బంధించి స్థలం రెగ్యులరైజ్ అయినట్లు ప్రొసీడింగ్ కాపీ ఇంతవరకు ఆయనకు అందలేదు. దీనిపై ఆ పంచాయ తీ కార్యదర్శిని సంప్రదించగా.. మీ అప్లికేషన్ ఇంకా ఎ ల్-1 దశలోనే ఉన్నదని, ఎల్-1, ఎల్-2, ఎల్-3 స్థా యిలో పరిశీలన పూర్తయిన తర్వాతనే క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయినట్లని చెప్పారు.
మరి ఆయా దశల్లో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే కట్టిన ఫీజు వాపసు చేస్తారా? అని సదరు వ్యక్తి అడిగితే.. ఆ విషయం మా కు తెలియదని సమాధానం చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫోన్ చేసి డబ్బులు కట్టించడం వరకే మా పని అని, మిగతా వివరాలపై తమకు స్పష్టత లేదని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో సదరు వ్యక్తి చేసేదేమి లేక వెనుదిరిగాడు. రూ.2 లక్షలకు పైగా ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి ప్రొసీడింగ్ కాపీ కోస ం ఎదురు చూడాల్సి వస్తున్నదని ఆయన వాపోయాడు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారింది. దీంతో గ్రామాల పరిధిలోని ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారులు పెద్దగా ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం 17,967 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో సరైన పత్రాలు లేని కారణంగా 71 దరఖాస్తులను తిరస్కరించారు. అలాగే కొన్ని స్థలాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయంటూ మరో 925 దరఖాస్తులను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టారు. ఇవి పోగా మిగిలిన మొత్తం 16,241 దరఖాస్తులను ఎల్ఆర్ఎస్కు అర్హత ఉన్నవిగా గుర్తించారు.
వీరికి ఆయా పంచాయతీల పరిధిలోని కార్యదర్శులు ఫోన్లు చేసి మీ ప్లాట్‌కు ఫీజు కట్టి క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 913(5.6శాతం) దరఖాస్తుదారులు మాత్రమే పూర్తి ఫీజును చెల్లించారు. అయితే ఇప్పటి వరకు వీరిలో ఒక్కరికి కూడా తమ స్థలాలు రెగ్యులరైజ్ అయినట్లు ప్రొసీడింగ్ కాపీలు అందలేదు. ఫీజు చెల్లించినప్పటికీ ఇంకా వివిధ దశల్లో సదరు స్థలాలపై విచారణ జరుపాల్సి ఉంటుందని, ఆ తర్వాతే సంబంధిత స్థలం పూర్తిగా రెగ్యులరైజ్ అయినట్లు అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించినప్పటికీ.. ప్రక్రియ పూర్తి కావడానికి దరఖాస్తుదారులు మరికొన్ని రోజులు నిరీక్షించాల్సివస్తున్నది.
నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల పరిధి లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పం దన లభించడం లేదు. ఇప్పటి వరకు ఆయా పట్టణాల్లో ఫీజుల చెల్లింపు 10 శాతం కూడా దాటలేదు. మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం దఖాస్తులు 26,527 రాగా, వీటిలో సరైన పత్రాలు లేకపోవడం, ఇతర కారణాలు చూపుతూ 6,451 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. అలాగే మరో 2,993 దరఖాస్తులను ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూములకు సంబంధించినవని ధ్రువీకరించి వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు.
ఇవి పోగా మిగిలిన 17,083 దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న స్థలాలుగా గుర్తించి, ఆయా స్థలాల దరఖాస్తుదారుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే గురువారం నాటికి 1,105 (6.5శాతం) మం ది మాత్రమే ఫీజు చెల్లించారు. వీరిలో 525 మందికి ఇంకా ప్రొసీడింగ్ కాపీలు కూడా అందలేదు. ఇందులో ఎక్కువగా నిర్మల్ మున్సిపాలిటీ నుంచే 810 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. భైంసా పట్టణంలో 225, ఖానాపూర్ నుంచి 70 మంది ఇప్పటి వరకు తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం డబ్బులు కట్టారు.