లోకేశ్వరం, నవంబర్ 3 : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్(22), అదే గ్రామానికి చెందిన భూంపల్లి అఖిల(21)లు మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అఖిల ఇంటర్మీడియెట్ పూర్తికాగా.. నరేశ్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో నరేశ్ ఆదివారం సాయంత్రం గోదావరిలో దూకాడు. విషయం తెలుసుకున్న అఖిల కూడా 20 నిమిషాల వ్యవధిలో అదే గోదావరిలో దూకింది. సోమవారం ఉదయం స్థానికులు మృతదేహాలను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నరేశ్ తల్లి ముత్తవ్వ ఫిర్యాదు మేరకు లోకేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లోకేశ్వరం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ అశోక్ తెలిపారు.