మంచిర్యాలటౌన్, మే 13: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల పట్టణంలో 88 కేంద్రాలను ఏర్పాటుచేశారు. కార్మెల్ హైస్కూల్లోని కేంద్రంలో ఎమ్మెల్యే కే ప్రేంసాగర్‌రావు, ఆయన సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఓటు వేశారు. హిందీ హైస్కూల్లో మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆయన సతీమణి రాజకుమారి, బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, ఆయన సతీమణి ఉదయశ్రీ, జడ్పీ బాలుర పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, ఆయన సతీమణి హేమానళిని ఓటు వేశారు.
సాధారణ పౌరుడిలా క్యూ లైన్లో కలెక్టర్..
సీసీసీ నస్పూర్, మే 13: నస్పూర్ మున్సిపాలిటీలో 4 గంటల వరకు 49శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 25వార్డుల్లో 69,500 మంది ఓటర్లు ఉన్నారు. సంఘమల్లయ్యపల్లెలోని ఈవీ ఎం మొరాయించడంతో పోలింగ్ కొద్దిసేపు ఆలస్యంగా జరిగింది. కేంద్రాలను మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సందర్శించారు. సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు రవికుమార్, జితేందర్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్ సాధారణ పౌరుడిలా క్యూలైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి, మే 13: మండలంలోని 5 రూట్లు, 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మామిడిపెల్లి, నెల్కివెంకటాపూర్ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సందర్శించారు. బీఆర్ఎస్ యువ నాయకుడు విజిత్‌రావు సందర్శించారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, మే 13 : మండలంలోని నంనూర్, కర్నమామిడి, సబ్బెపల్లి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట పోలింగ్ అలస్యంగా మొదలైయింది. ఎస్ఐ సురేశ్ కుమార్ బందోబస్తును నిర్వహించారు. ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రపరిచే ప్రక్రియను మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట, మే 13 : మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామంలో ఈవీఎం మిషన్ రెండు గంటల పాటు మొరాయించింది. మండలంలో మొత్తం 42547మంది ఓటర్లకు గాను 28389మంది (66.72శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారని తహసీల్దార్ రాఘవేంద్రరావు తెలిపాడు. బందోబస్తును లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన బాల్క సుమన్
చెన్నూర్ రూరల్, మే 13: చెన్నూర్ మండలంలో కిష్టంపేటలోని పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సందర్శించారు. సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భీమారంలో ఓటర్ స్లిప్‌లు అందక ఇబ్బందులు..
భీమారం, మే 13 : భీమారంతో పాటు వివిధ గ్రామాల్లో బీఎల్వోలు సరిగా ఓటర్ స్లిప్‌లు పంపి ణీ చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. మండల కేంద్రంలో 63.75 శాతం పోలింగ్ నమోదైంది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేక పోవడంతో వెనక్కి పంపించారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల అవతల ప్రచారం చేయాల్సి ఉండగా కాం గ్రెస్ నాయకులు నిబంధనలు ఉల్లంఘించారు.
సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు..
జైపూర్, మే 13: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన శివ్వారం, నర్వ, ఇందారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాలతో పాటు, వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్‌ను పరిశీలించినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ మోహన్, అధికారులు తెలిపారు. జైపూర్ పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ సందర్శించారు.
కోటపల్లి మండలంలో సీపీ పర్యటన
కోటపల్లి, మే 13 : మండలంలో 33 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ సరళిని రామగుండం సీపీ శ్రీనివాస్‌తో పాటు చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్ పర్యవేక్షించారు.
ఓటేసిన రాజారం గ్రామస్తులు..
‘మా గ్రామానికి రోడ్డేస్తేనే ఓటేస్తాం’ అని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు ఓటేశారు. ఇటీవల అదనపు కలెక్టర్ మోతీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. గ్రామంలో 78 శాతం పోలింగ్ శాతం నమోదైందని గ్రామ పంచాయతీ కార్యదర్శి అజ్మీరా రమాదేవి, అధికారులు తెలిపారు.
చెన్నూర్‌లో..
చెన్నూర్, మే 13: చెన్నూర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని 190వ పోలింగ్ కేంద్రంలో 105 సంవత్సరాల వృద్ధుడు రేవెల్లి పోచం వీల్ చైర్లో వచ్చి ఓటేశాడు. పోలింగ్ సమయం ముగియగానే గేట్లు మూసి వేయడంతో ఓటర్లు వెనుదిరిగారు.
ఓటేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రముఖులు..
రామకృష్ణాపూర్, మే 13: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 35 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యాతనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఆయన సతీమణి రాణి అలేఖ్య ఓటేశారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించారు. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్, భార్య, కుమార్తెతో వచ్చి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని క్రిస్ట్ ఉన్నత పాఠశాలలో ఓటేశారు.
మందమర్రి మండలంలో..
మందమర్రి/మందమర్రి రూరల్ మే 13: మందమర్రి మండలంలో 90 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ బాల సుమన్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జబర్దస్త్ వెంకీ భార్య వైష్ణవితో కలిసి సింగరేణి పాఠశాలలో ఓటు హకు వినియోగించుకున్నారు.
బెల్లంపల్లిలో 70.53 పోలింగ్ నమోదు
బెల్లంపల్లి, మే 13: బెల్లంపల్లి నియోజకవర్గంలో 70.53 పోలింగ్ శాతం నమోదైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాహుల్ తెలిపారు. బజార్ ఏరియా పాఠశాల పట్టణంలోని బజార్ ఏరియా పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను రామగుండం సీపీ శ్రీనివాస్ సందర్శించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దీన్ తదితరులు ఉన్నారు.
కన్నెపల్లి, భీమిని మండలాల్లో..
కన్నెపల్లి, మే 13 : కన్నెపల్లి మండలంలో 80 శాతం, భీమినిలో 79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. భీమిని మండలంలోని చిన్న తిమ్మాపూర్ ఓటర్లు గ్రామంలో పోలింగ్ కేంద్రం లేకపోవడంతో తంగళ్లపల్లికి మూడు కిలోమీటర్ల నడిచి వచ్చారు.
తాండూర్‌లో..
తాండూర్, మే 13 : మండలంలో 37 కేంద్రాల్లో 27209 మంది ఓటర్లకు గాను 18797 మంది(69.09 శాతం) ఓటు వేశారు. కొన్ని పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. పలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పిటీసీ సాలిగామ బానయ్య, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి, ప్రజాప్రతినిధులు, సీనీ గేయ రచయిత తైదాల బాపు ఓటేశారు. సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో అదనపు ఎస్ఐ చంద్ర మిస్త్రీ, మాదారం ఎస్ఐ గొల్లపల్లి అనూష బందోబస్తు నిర్వహించారు.
సెల్ఫోన్లను అనుమతించని అధికారులు
కాసిపేట, మే 13 : కాసిపేట మండలంలో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. కొన్ని చోట్ల పలువురు అతి ఉత్సాహంతో ఫోన్‌ను తీసుకొని తమ ఓటు వేసే విధానాన్ని చిత్రీకరించే చర్యలను చేపట్టగా అధికారులు ముందుగానే పసిగట్టి సెల్ఫోన్లను లాక్కొని నిలవరించారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాపూర్, ధర్మారావుపేట, సోమగూడెం, తదితర గ్రామాల పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సరళిని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. దేవాపూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, నాయకులు మచ్చ అశోక్, మచ్చ అనిల్, కైలాస్, హైదర్, ధర్మరావుపేటలో ఏనుగు మంజులారెడ్డి, సుధాకర్ రెడ్డి, బాషవేణి కొమురయ్య, సోమగూడెంలో వెల్ది శ్రావణ్, చింతల భీ మయ్య, రెడ్డి కనకయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఓటేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నెన్నెల, మే 13: జెండావెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్ఐ ప్రదీప్ ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లిరూరల్, మే 13: మండలంలో బుదాకుర్థు గ్రామ పరిధిలోని కాసిరెడ్డిపల్లిలో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. చాకేపల్లి, చంద్రవెళ్లి, బుదాకలన్, తాళ్లగురిజాల అంకుశం, కన్నాల, సోమగూడెం, ఆకెనపల్లి, శివలింగాపూర్, బుచ్చయ్యపల్లి ,పాతబెల్లంపల్లి గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కేంద్రాలను బెల్లంపల్లిరూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్, తాళ్లగురిజాల ఎస్ఐ జీ నరేశ్ పర్యవేక్షించారు.
వేమనపల్లిలో 72 శాతం పోలింగ్..
వేమనపల్లి, మే 13 : మండలంలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాల్లో 14984 మంది ఓటర్లకు గాను 10,809 మంది ఓటేశారు. 72 శాతం పోలింగ్ నమోదైనట్లు తహసీల్దార్ రమేశ్ తెలిపారు.