ఆసిఫాబాద్ టౌన్, మే 13: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లోకసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 4 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసినప్పటికి లోపల ఉన్న ఓటర్ల ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల వరకు 67.21 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ సురేశ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి తిర్యాణి మండలం చింతలమాదార మందగూడ పోలింగ్ బూత్‌లో ఓటు హకును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు తిర్యాణి మండలం లక్ష్మిపూర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలసి ఓటే వేశారు. జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఎస్పీ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెబ్బెనలో..
రెబ్బెన, మే 13 : రెబ్బెన మండలంలో మొత్తం 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక కేంద్రానికి నలుగురు సిబ్బందిని కేటాయించారు. గోలేటి పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సురేశ్‌కుమార్ పరిశీలించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు రెబ్బెన పోలింగ్ కేంద్రం సందర్శించారు. బీఆర్ఎస్ నాయకులను పోలింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు. రెబ్బెన సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
కెరమెరి మండలంలో..
కెరమెరి, మే 13: మండలంలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గంటసేపు ఆలస్యం జరిగింది. ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, సీఐ రమేశ్ ఎన్నికలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. కెరమెరి ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
లింగాపూర్ మండలంలో
లింగాపూర్,మే 13 : మండలంలో మొత్తం10369 ఓటర్లు ఉండగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7720 మంది ఓటుహక్కును వినియోగించుకోగా 74శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కాగజ్‌నగర్ పట్టణంలో…
కాగజ్‌నగర్, మే 13: కాగజ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు సిర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,29,101 మంది ఓటర్లు ఉండగా 1,63,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 68.14 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సతీమణి రమాదేవి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగజనగర్ మండలంలోని చారిగాం రోడ్డులో నివాసం ఉంటున్నా జాకీర్ పాషా దివ్యాంగుడు పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కాలితో తమ ఓటేశాడు. అదనపు కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి దీపక్ తివారీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ శంకరయ్య పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(టీ)లో..
సిర్పూర్(టీ), మే 13 : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ రాజీవ్ కుమార్ సక్సేనా పరిశీలించారు.123, 128 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది ఓటర్లతో అతిగా ప్రవర్తించడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను కౌటల సీఐ సాదిక్ పాషా, సిర్పూర్(టీ) ఎస్ఐ దీకొండ రమేశ్ పరిశీలించారు. మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో నిజామాబాద్ న్యాయమూర్తి చైతన్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దుర్గం భాస్కర్ తమ ఓటేశారు.
కౌటాలలో..
కౌటాల, మే 13: మండల వ్యాప్తంగా 72శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కౌటాల సీఐ సాదిక్ పాషా ఆధ్వర్యంలో ఎస్ఐ మధుకర్ బందో బస్తు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంతో పాటు తలోడి, తాటిపల్లి, గుడ్లబోరి, తదితర గ్రామాల్లో సమయం దాటిపోవడంతో ఓటర్లు తమ ఓటు వినియోగించుకోలేకపోయారు.
చింతలమానేపల్లి మండలంలో..
చింతలమానేపల్లి, మే 13 : బాలాజీ అనుకోడలోని 197 బూత్‌లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియడంతో ఆలస్యంగా వచ్చిన ఓటర్లను అనుమతించక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కౌటాల సీఐ సాదిక్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
బెజ్జూర్ మండలంలో..
బెజ్జూర్, మే 13 : మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం 219లో కేంద్ర భవనం స్లాబ్ పెచ్చులు పోలింగ్ సిబ్బంది మార సాయికృష్ణ తలపై, ఎడమ భుజంపై పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఏఎన్ఎం మేఘన సిబ్బందికి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తర్వాత పోలింగ్ సిబ్బంది మళ్లీ పెచ్చులు పడకుండా అదే కేంద్రంలో టేబుళ్లను దిశమార్చి పోలింగ్‌ను కొనసాగించారు.
పెంచికలపేట్ మండలంలో..
పెంచికలపేట్, మే 13 : మండలంలో 70 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఎస్ఐ కొమురయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
76 శాతం పోలింగ్ నమోదు
దహెగాం, మే 13 : మండలంలో 76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఐదు రూట్లతో పాటు 172 మంది సిబ్బంది, 60 మంది పోలీసులు విధులు నిర్వహించారు.
జైనూర్ మండలంలో..
జైనూర్, మే 13: మండలంలో 60 శాతం పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జైనూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సురేశ్ కుమార్ సందర్శించారు. ఎన్నికల నిర్వహణపై ఆరాతీశారు.