మంచిర్యాల, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన జూపల్లి కృష్ణారావుకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో పెను సవాల్ ఎదురుకానుంది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఆదేశించడం, ఇటీవల టీపీసీసీ, పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్చార్జి మంత్రులదే అంటూ చేతులు ఎత్తేశారు.
ఈ నేపథ్యంలో కొత్త ఇన్చార్జి మంత్రి లోకల్ బాడీస్ ఎన్నికలను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జి మంత్రిగా తొలిసారి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన గురువారం ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్ గైర్హాజరయ్యారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం రాకపోవడంతో అసహనంతో ఉన్నారు.
అందుకే సమీక్షకు దూరంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ‘స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను జిల్లా ఇన్చార్జి మంత్రులకే అప్పగించారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణంపైన దృష్టి సారించాలంటూ సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇన్చార్జి మంత్రి పర్యటన, హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
ఓ వైపు వ్యతిరేకత.. మరో వైపు సమన్వయ లోపం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం అన్నది ఇప్పుడు ఇన్చార్జి మంత్రి ముందున్న సవాల్‌గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కరీంనగర్- నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేక పోయింది. దీనికి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత, స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అన్న చర్చ నడుస్తున్నది.
పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ హస్తం పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవని నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లా నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి, టికెట్లు ఇవ్వడం, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులను పూరించడం కత్తిమీద సాములా మారనుంది. పైగా స్థానిక ఎమ్మెల్యేలు, లీడర్లను కాద ని ఈ బాధ్యతలు ఇన్చార్జి మంత్రికి అప్పగించడంపై నా లోకల్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు.
తక్కువ సమయంలో సాధ్యమేనా?
ఉమ్మడి జిల్లాకు మొన్నటి దాక మంత్రి సీతక్క ఇన్చార్జిగా ఉండగా, ఇటీవలే జూపల్లి కృష్ణారావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు మూడు నెలల్లో ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలున్నాయి. దీంతో ఇంత తక్కువ సమయంలో నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా విషయానికొస్తే.. ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్, చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేక్‌లను ఇద్దరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం కుదరని పని. ఇప్పటికే పీఎస్ఆర్ నా నియోజవర్గానికి ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్‌పై ఆశలు పెట్టుకున్న మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇద్దరిలో ఎవరికీ ప్రయార్టీ ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వినోద్ ఉన్నారు. మంచిర్యాల పీఎస్ఆర్ స్వగ్రామం ఆ నియోజకవర్గంలో ఉంది. పైగా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్ అక్కడ పట్టుసాధించేందుకు లోకల్ బాడీ ఎన్నికలను పర్సనల్‌గా తీసుకునే చాన్స్ లేకపోలేదు. దీన్ని ఎలా సమన్వయం చేస్తారన్నది ఇక్కడ సవాల్‌గా మారనుంది. ఇకపోతే హస్తం పార్టీలో కొత్త, పాత వివాదం నడుస్తున్నది.
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆడె గజెందర్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా ఉన్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం కంది శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని గతంలో పార్టీ కోసం పని చేసి సస్పెండైన సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఖానాపూర్‌లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నారు. కానీ.. అక్కడే మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి పట్టుకోసం వారు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.
నిర్మల్ నియోజకవర్గంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తాజా మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ముగ్గురు లీడర్ల మధ్య సయోధ్య కుదరడం లేదు. పార్టీ పరంగా సరైన సంబంధాలు లేవు.
ముథోల్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డిలను ఏకతాటిపైకి తేవడం కష్టం కావచ్చు.
కాగజ్‌నగర్ నియోజకవర్గంలో హస్తం పార్టీ మూడు వర్గాలుగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి దూరంగా ఉంటానంటూ ప్రకటించారు. ఆయన కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మార్క్ చూపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మరో గ్రూప్ ఉండగా, నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ మరోవర్గంగా ఉన్నారు. ఇలా ఎవరికి వారు యమునే తీరే అన్న చందంగా కాగజ్నగగ్ నియోజకవర్గ పరిస్థితి తయారైంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలా ముందుకు వెళ్తారు. స్థానిక నాయకుల మధ్య సమన్వయం ఎలా కుదురుస్తారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఎవరికీ కట్టబెడుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది.