ఓ వ్యక్తి పదేళ్లక్రితం చనిపోగా.. అదే పేరున్న ఇంకొకరితో ఈ కైవేసీ పూర్తి చేసి.. భూమిని కాజేసే కుట్రకు దిగాడు స్థానిక కాంగ్రెస్ లీడర్ (కౌలుదారు). మరో నాయకుడి అండ దండలు.. రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టా పాస్ బుక్ పొందాడు. దానిని తమ వాళ్ల పేరిట పట్టా చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకోగా, అదే రోజు మాజీ ప్రధాని మృతికి సెలవు ప్రకటించడం.. అంతలోనే మృతుడి కుమారుల ఫిర్యాదుతో అసలు బాగోతం బయటపడింది.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 29 : చెన్నూర్ మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూర లచ్చయ్య (తండ్రి పేరు లస్మయ్య) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలోని రాయిపేటకు వెళ్లాడు. లచ్చయ్య పేరు మీద రచ్చపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పొక్కూరు శివారులో సర్వే నంబర్ 876లో ఎకరం 35 గుంటల భూమి ఉన్నది. ఆ భూమిని లచ్చయ్య కుమారులు దగ్గరి బంధువు(కాంగ్రెస్ లీడర్)కు కౌలుకిచ్చారు. యేటా కౌలు తీసుకుంటున్నారు. సుమారు పదేళ్ల క్రితం లచ్చయ్య మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ధరణి పోర్టల్ వచ్చింది.
అప్పటికే లచ్చయ్య మృతి చెందడంతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ భూమి లచ్చయ్య కొడుకుల పేరు మీదికి మారలేదు. దీనిని ఆసరాగా చేసుకొని కౌలు చేసుకుంటున్న సదరు లీడర్.. ఆ భూమిని స్వాహా చేసేందుకు మరో నాయకుడితో కలిసి పథకం పన్నాడు. మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలోని రాయిపేటలో తన బంధువు కూడా బచ్చలకూర లచ్చయ్య పేరుతో ఉన్నాడని గుర్తించారు. లచ్చయ్య తండ్రి పేరు ఆధార్‌లో వేరే ఉండడంతో.. తండ్రి లస్మయ్య పేరు ఉన్నట్లుగా నకిలీ ఆధార్ కార్డు తయారు చేశారు. చెన్నూర్ మీసేవలో పాస్ బుక్కు పొందడానికి ఈ కేవైసీకి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వెంటనే పాస్‌బుక్ మంజూరు చేశారు.
రెవెన్యూ అధికారుల చేతివాటం
ధరణి వచ్చి దాదాపు పదేళ్లవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బచ్చలకూర లచ్చయ్య ఈ కేవైసీ నమోదు లేదు. దీంతో రాయిపేటకు చెందిన లచ్చయ్య (నకిలీ) ద్వారా దరఖాస్తు చేసుకోగానే ఆర్ఐతో పాటు సిబ్బంది గ్రామానికి వెళ్లి మోఖ పంచనామా నిర్వహించారు. నిబంధనల ప్రకారం మోఖ పంచనామా రికార్డు కోసం రచ్చపల్లి గ్రామానికి వెళ్లాలి. రచ్చపల్లికి చెందిన రైతుల సాక్ష్యాలు (పంచులు) తీసుకోవాలి. వారి వాంగ్మూలం రికార్డు చేయాలి. ఈ నిబంధనలేవీ పాటించకుండా ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వాంగ్మూలం రికార్డు చేశారు. వివరాలు అన్ని సక్రమంగా ఉన్నాయంటూ నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. నెల రోజులు కావాల్సిన ఈకేవైసీ వారంలో పూర్తయ్యింది. దీనికి ఇద్దరు రెవన్యూ అధికారులు. ఒక దస్తావేజులేకరి, ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వెంటనే వేరే వాళ్ల పేర్ల మీదికి పట్టా మార్పిడి
వేరే వ్యక్తిని చూపి ఈ కేవైసీ పూర్తి చేసి పట్టా పాస్ బుక్కు పొందిన నాలుగు రోజులకే లచ్చయ్య పేరు మీద ఉన్న భూమిని వారి బంధువులు అయిన ఇద్దరి మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారు. ఇందుకోసం ఈ నెల 27న స్లాట్ బుక్ చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి చెందడం.. ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న లచ్చయ్య వారసులు వచ్చి జరిగిన విషయాన్ని తహసీల్దార్‌కు వివరించారు. లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్ఐని ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.