HomeAdilabadLocal Body Elections Likely To Be Held Next Month Following High Court Ruling
సందడి.. సందిగ్థం
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా, ప్రభుత్వం వచ్చే (సెప్టెంబర్) నెలాఖరులోగా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
హైకోర్టు తీర్పుతో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం
సన్నద్ధమైన అధికార యంత్రాంగం
రంగంలోకి దిగుతున్న ఆశావహులు
పార్టీల వారీగా తీవ్రమైన పోటీ
రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ
మంచిర్యాల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా, ప్రభుత్వం వచ్చే (సెప్టెంబర్) నెలాఖరులోగా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ముందుగా జడ్పీటీసీ లేక ఎంపీటీసీ.. ఆపై సర్పంచ్ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఉహాగానాలు వినిపిస్తుండగా, సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఇప్పటికే ఏ గ్రామంలో చూసినా పార్టీల వారీగా తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తుండగా, రిజర్వేషన్లపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఎలక్షన్లు వాయిదా పడుతాయేమోనన్న సందిగ్ధం నెలకొంది.
రిజర్వేషన్లపై స్పష్టత కరువు
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్న గొప్ప ఆలోచనతో తెలంగాణ కేసీఆర్ సర్కారు స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను సవరించింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా, నేటి సమాజానికి తగ్గట్లుగా కొత్త చట్టాలు తెచ్చింది. కొత్త చట్టాలను అనుసరించి గతంలో ఖరారైన రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమలు చేయొచ్చు. అంటే పంచాయతీ ఎన్నికలు ఆరేళ్ల క్రితం జరిగినందున ఈసారి అవే రిజర్వేషన్లు కొనసాగించవచ్చు. కానీ కాంగ్రెస్ సర్కారు పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తుందా.. లేకపోతే కొత్త పద్ధతిలో ముందుకెళ్తుందా అన్నది ఎటూ తేలడం లే దు. దీంతో ఎన్నికలు వస్తాయన్న సందడి ఓ వైపు ఉంటే.. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేక ఎన్నికలు వాయిదా పడుతాయేమోనన్న సందిగ్ధత నెలకొంది.
కానీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వచ్చే నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించడం అనివార్యమనే అంతా భావిస్తున్నారు. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో సందడి చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు గ్రామాల్లో కలియదిరుగుతూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఒక్కో పార్టీకి ఇద్దరు, ముగ్గురు ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు తలమునకలైపోవడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైపోయింది.
ఆషాఢంలో దావత్‌లు.. శ్రావణంలో శుభకార్యాలు
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ బరిలో నిలబడాలని ఉవ్విళ్ల్లూరుతున్న ఆశావాహులు ఇప్పటికే జనాల్లో తిరగడం మొదలుపెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు లీడర్లు స్థానిక యువతను, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకునే పన్నుల్లో నిమగ్నమయ్యారు. కొందరైతే కుల సంఘాల వారీగా, గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులకు దావత్‌లు పెడుతూ అందరినీ తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు. పోయిన ఆషాఢ మాసంలో వన భోజనాలు, వాడ పోచమ్మలు, బోనాల పండుగలను దగ్గరుండి చేయించడంతో పాటు మద్యం సైతం ఏర్పాటు చేస్తూ జోరు పెంచిన ఆశావాహులు.. ఇప్పుడు శ్రావణమాసాన్ని అదే స్థాయిలో వాడుకుంటున్నారు. ఏ ఇంట్లో శుభకార్యమైనా, పండుగైనా తమదే అన్నట్లు కలివిడిగా తిరుగుతూ ముందుపడి మరీ పనులు చేయిస్తున్నారు.
ఎన్నికల కోడ్ వచ్చాక డబ్బులు సర్దుకోవడం ఇబ్బందవుతుందని భావించి కొందరు ఇప్పటి నుంచే నగదును సమకూర్చుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలకు బరిలో నిలిచే వారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో తాము పోటీ చేయబోతున్నట్లు, ఫలానా పార్టీ నుంచి నాకే టికెట్ వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్లు ఇస్తారని, ముఖ్య నేతల చుట్లూ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, అధ్యక్షులతో నిరంతరం టచ్‌లో ఉంటూ.. టికెట్లు చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
రిజర్వేషన్లపై ఆశలు..
ఆశావాహులు రిజర్వేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. బీసీలకు ఇస్తామన్న కోటా ఇస్తే పోటీ చేయొచ్చని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరికొందరేమో గత సర్కారు విధానాన్ని అనుసరించి ఈ ఒక్కసారికి పాత రిజర్వేషన్లనే పాటించాలని కోరుకుంటున్నారు. 2019, జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాటి కాల పరిమితి 2024, ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఇప్పటికే పంచాయతీలు కళ తప్పాయి. రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి మొగ్గు చూపితే ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు అనుసరించి మూడు నెలల కాల పరిమితిలోగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే హడావుడిగా రిజర్వేషన్ల అంశాన్ని పూర్తి చేసే వీలుంది.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారయ్యాక మరింత మంది పోటీదారులు బయటకి వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. మరోవైపు అధికారులు పంచాయతీల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. బీఎల్వోలతో సర్వే చేయించి, గతంలోనే తుది ఓటరు జాబితాలను ప్రచురించారు. ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్ల సరఫరాకు టెండర్లు పిలవడం కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్నికల సామగ్రి సైతం మండల కేంద్రాలకు చేరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడినా విజయవంతం చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. వచ్చే నెలలో ఎన్నికలు, రిజర్వేషన్లపై తుది నిర్ణయం కోసం అటు ఆశావాహులు, ఇటు అధికారులు అంతా ఎదురు చూస్తున్నారు.