హాజీపూర్, జూలై 31 : రెండవ విడుత రుణమాఫీ డబ్బులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చెల్లించాలని బ్యాంకు అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో రుణమాఫీ నగదు చెల్లింపు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడుత రుణమాఫీలో భాగంగా రూ.లక్ష నుంచి రూ. లక్షా యాభైవేల వరకు రుణం గల రైతులకు నగదు చెల్లిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండవ విడుత రుణమాఫీలో 14,104 మంది రైతులకు రూ.136,46,56,254 అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రుణమాఫీ నగదు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికా బద్ధంగా నగదు చెల్లించాలన్నారు. రైతులు ఏదైనా సమాచారం కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నం. 08736-250501లో గానీ మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. రైతుల పట్ల బ్యాంక్ అధికారులు, సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని, జవాబుదారితనంతో వ్యవహరించాలని ఆదేశించారు.
రెండవ విడుత రుణమాఫీ ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ను పరిశీలించారు. భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, పేర్లు, ఇతర వివరాల మార్పుల సవరణ కోసం దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తు తిరస్కరణకు కారణాన్ని నమోదు చేయాలని తెలిపారు.
కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల, తదితర సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేయవద్దని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రావ్ దేశ్పాండే, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.