నిర్మల్ అర్బన్, జూన్ 11 : సాహితీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్లో సాహితీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలు పోరాటం చేశాయన్నారు. ముఖ్యంగా కవులు, కళాకారులు, సాహితీ వేత్తల పోరాటం అభినందనీయమన్నారు. కవులు తమ గొంతులతో ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ఎలుగెత్తి చాటారని గుర్తు చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి పోరాటాన్ని ప్రభుత్వం మళ్లీ గుర్తు చేయడం అభినందనీయమన్నారు. సాహితీ రంగాన్ని గుర్తించి కళాకారులకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చిందని తెలిపారు.
సాహితీ దినోత్సవం సందర్భంగా పలువురు కవులు కవితా గానం చేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. వేడుకలకు హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పలువురు కవులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు బుక్ ఫెయిర్ నిర్వహించారు. డ్యాన్స్ మాస్టర్ ఎట్టెం రజిత ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్ రావు, డీఈవో రవీందర్ రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, కవులు డాక్టర్ కృష్ణం రాజు, డాక్టర్ అప్పాల చక్రధారి, వెంకట్, పత్తి శివప్రసాద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
సాహితీ వేత్తల విగ్రహాలకు నివాళి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహితీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక కలెక్టరేట్లోని కవయిత్రి మొల్ల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి మడిపెల్లి భద్రయ్య విగ్రహాలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కవులు, సాహితీ వేత్తల పాత్ర ఎంతో ఉందన్నారు. వారు చేసిన పోరాటాలు, రాసిన పాటలు, సాహిత్యం తదితర వాటిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఈవో రవీందర్ రెడ్డి, కవులు డాక్టర్ కృష్ణంరాజు, అప్పాల చక్రధారి, బొందిడి పురుషోత్తం, తుమ్మల దేవ్‌రావ్, సాహితీ వేత్తలు తదితరులు పాల్గొన్నారు.