నార్నూర్/బేల జూన్ 12 : ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో గురువారం ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. చేనులో పనిచేనులో పనిచేస్తుండగా.. ఒక్కసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో ఇద్దరు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి. గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో గురువారం మధ్యాహ్నం పెందోర్ మహద్రావు చేనులో మక్క విత్తనాలు విత్తేందుకు 13 మంది కూలీలు పని కోసం వెళ్లారు. భారీ వర్షం కుస్తుండడంతో చేను వద్దే ఉన్న పందిరిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే భోజనం చేస్తుండగా.. ఒక్కసారి పిడుగు వారిపై పడింది.
దీంతో సిడాం రాంబాయి(35), పెందోర్ మహద్రావు(42), పెందోర్ సంజన్న(19), మంగం భీంబాయి(35) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ జీవన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగు పడి నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సొంఖాస్ గ్రామానికి చెందిన కోవ సునీత(38) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. గురువారం చేనులో పని చేస్తుండగా పిడుగు పడడంతో ఆమె అకడికకడే మృతి చెందింది. రోజూ కూలీ పనులకు వెళ్లి వచ్చే అమ్మ మృతి చెందిందన్న వార్తతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సునీతకు భర్త భారత్‌తోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే పెండల్వాడ గ్రామానికి చెందిన గెడం నందిని(30) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవడంతో సాంగిడి గ్రామంలో ఉంటున్న తన తల్లి గారింట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నది.
ఆమె భర్త హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్ చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని భార్య కూడా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కూలీ పనులకు వెళ్లిన ఆమె పిడుగు పడి మృతి చెందడంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఆమెకు భర్త, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగ్నాథ్ తెలిపారు.
ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపడి ఆరుగురు మరణించడం బాధాకరమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పిడుగుపడి బేల మండలంలో ఇద్దరు వ్యవసాయ కూలీలు, గాదిగూడలో నలుగురు కూలీలు మరణించగా రిమ్స్ మార్చురీలో ఉన్న మృతదేహాలను ఆయన పరిశీలించారు. పేద కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయపనులు చేస్తుండగా పిడుగుపడి మరణించిన ఘటన దిగ్భాంతికి గురి చేసిందన్నారు. ఆరుగురు కూలీలు మరణించడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రౌతు మనోహర్, యూనిక్ అక్బానీ, తన్వీర్, రాజేశ్ ఉన్నారు. పిడుగుపాటు బాధితులను సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ కూడా నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఎదులాపురం, జూన్ 12 : పిడుగు పడే సమయంలో జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. కారు మబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలాన్నారు. ఈ పిడుగుపాటుకు వ్యవసాయ క్షేత్రాలు, చెట్లకింద ఉన్నవారే గురవుతున్నట్లు తెలిపారు.
ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు లోహపు వస్తువులను చేతిలో పట్టుకోవడం మంచిది కాదు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదు. నీటిలో ఉండకూడదు నదులు, వాగులు, చెరువుల్లో స్నానం చేయడం మంచిది కాదు భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చొవాలి పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రభావం తకువగా పడే అవకాశం ఉంటుంది.
మోకాళ్లపై చేతులు, తలపెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చొవడం వల్ల పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం తకువగా ఉంటుంది. ల్యాండ్ ఫోన్ మాట్లాడ కూడదు. సెల్ ఫోన్ వినియోగించవచ్చు.(అది కూడ ఇంట్లో ఉన్నపుడు మాత్రమే). స్విచ్‌బోర్డ్ నుంచి అన్ని కనెక్షన్లు తీసివేయాలి. షవర్ కింద స్నానం, చేతులు, గిన్నెలు కడగడం వంటివి చేయకూడదు. ఇంటి తలుపులు, కిటికీల వద్ద నిలబడకూడదు. మూసి ఉంచాలి. ఈ సందర్భంగా ఎకువగా ఈ పిడుగుపాటుకు వ్యవసాయ పనులు చేసే రైతులు, ఆరు బయట పనిచేసే భవన కార్మికులు, నీటి గొట్టాలు బిగించే వారు, విద్యుత్ టవర్ల వద్ద పనిచేసే వారు, వాహనదారులు, పాదచారులు పిడుగుపాటుకు ఎకువగా గురవుతున్నారని పైన తెలిపిన కొన్ని జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు.