ఎదులాపురం, ఏప్రిల్ 7 : ఎకరం వ్యవసాయ భూమి కోసం వ్యక్తిని హత్య చేసిన కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదుపాటు ఒకొక్కరికి రూ.1000 చొప్పున రూ.2 వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు తీర్పు వెలువరిచినట్లు కోర్టు లైసెన్ అధికారి గంగాసింగ్ తెలిపారు. తీర్పు వివరాలు ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాద్ నంబర్ గ్రామానికి చెందిన వనోలే ఈశ్వరరావు 26 డిసెంబర్ 2023న ఎకరం వ్యవసాయ భూమి వివాదం కారణంగా ఇచ్చోడ-సిరిచెల్మ చౌరస్తా వద్ద తండ్రీకొడుకులు వనోలే సూర్యకాంత్, వనోలే పాండురంగలు కలిసి వనోలే ఈశ్వరరావును హత్య చేశారు. భార్య వనోలే కవిత ఇచ్చోడ పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అప్పడు సీఐ చంద్రశేఖర్ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, సీడీవో రవీందర్‌రెడ్డి 20 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పీపీ రహీమ్ సాక్షులను సమర్థంగా విచారించి నేరాన్ని రుజువు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు వనోలే సూర్యకాంత్, వనోలే పాండురంగ్లకు జీవిత ఖైదు విధించారు.