భైంసాటౌన్, ఫిబ్రవరి 21: తానూర్ మండలంలో బెంబర గ్రామంలో గురువారం రాత్రి లేగ దూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తానూర్ మండలంలోని బెంబెరలోని సాయిలుకు చెందిన 15 రోజుల వయస్సు గల లేగదూడపై గురువారం రాత్రి చిరుతపులి దాడి చేసి సమీప పొదల్లోకి లాక్కెళ్లి చంపి తినేసింది.
అలాగే భైంసా మండలంలోని సిరాల గ్రామానికి చెందిన మోహన్రావ్ పటేల్ మక్కచేనుకు నీళ్లు పెడుతుండగా చిరుతపులి రావడంతో కేకలు వేశాడు. చేను వద్ద కట్టేసిన కుక్కపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు శుక్రవారం ఉదయం చిరుతపులి సంచరించిన ప్రాంతాలకు చేరుకుని పాదముద్రలను పరిశీలించి చిరుతపులి పిల్లగా గుర్తించారు. దాడి జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలను అమర్చారు.
మూడు సంవత్సరాలుగా చిరుతదాడిలో తమ పశువులు చనిపోతున్నాయని, అధికారులు చిరుతపులి బెడదను నివారించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో శంకర్ మాట్లాడుతూ.. పొలాల్లో చిరుతపులి పాదముద్రలు కనిపించాయని, అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లవద్దని రైతులను హెచ్చరించారు. చిరుతపులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, దానికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరారు.