ఆదిలాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటించడం, పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు రిజర్వేషన్ల మార్పు తీవ్ర నిరాశకు గురిచేసింది. వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీలు, ఉత్సాహవంతులు, యువకులు, ఈ సారి స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం వివిధ మార్గాల్లో ప్రజలను ఆకట్టుకునే మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో ప్రజల మధ్యన ఉంటూ తమ మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ట్రస్టుల పేరిట సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతూవచ్చారు. ప్రజల మన్ననలను సంపాదించేందుకు ప్రయత్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన తర్వాత రిజర్వేషన్ల మార్పుతో తమ మండలాలు, గ్రామాల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో నాయకులు ఒక్కసారిగా చల్లబడ్డారు. పదవుల ఆశతో ఇన్ని రోజుల ఉత్సాహంగా తిరిగిన ఆశావహులు ఇప్పుడు తమ సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో దగ్గరగా ఉండి స్థానిక ఎన్నికల పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన వారికి రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎన్నికల్లో మండలాలు, గ్రామాల్లో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులను గుర్తించి వారికి అవకాశం కల్పించాలనుకున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలకు రిజర్వేషన్లు సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రిజర్వేషన్లకు అనుకూలంగా కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ వారి గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించినా వారికి సొంత పలుకుబడి లేక గెలిచే అవకాశాలు దెబ్బతీస్తాయి. దీంతో ప్రజల్లో గు ర్తింపు పొందిన నాయకులకు కోసం పార్టీ నా యకులు అన్వేషిస్తున్నారు. మరో వైపు కో ర్డులో రిజర్వేషన్ల కేసు నడుస్తున్నందున ఈ ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అమల్లోకి వస్తా యా ? లేదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.