ఆదిలాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ ఆకాల మరణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటలు, పాటల ద్వారా సాయిచంద్ ప్రజలకు సుపరిచితులయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తన కళాప్రదర్శనలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఉద్యమ సమయంలో సాయిచంద్ ఎండగట్టారు. ప్రజలను ఉద్యమంవైపు ఆకర్షితులను చేయడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములను చేశారు. ఇటీవల నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా బహిరంగ సభలకు సాయిచంద్ కూడా హాజరయ్యారు.
కళాకారులతో కలిసి తన ఆటాపాటలతో ప్రజలను అలరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. నిర్మల్ సభలో జోరు వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయడకుండా సాయిచంద్ ఆటాపాటలను ఆసక్తిగా తిలకించారు. మంచిర్యాల సభలో కూడా ప్రజలు సాయిచంద్ కళాప్రదర్శనకు కరతాళధ్వనులతో జేజేలు పలికారు. సాయిచంద్ మరణంపై జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నా యకులు సంతాపం ప్రకటించారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమంలో ఆయన సేవలను కొ నియాడారు. నేడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సాయిచంద్ కూ డా హాజరుకావాల్సి ఉండగా, ఆయన కోసం స్థానిక నాయకులు గదిని సైతం బుక్ చేశారు. నేడు జరిగే బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సాయిచంద్‌కు నివాళులర్పించనున్నారు.
కుభీర్, జూన్ 29: తెలంగాణ ఉద్యమంలో తన గానంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన ఉద్యమ నాయకుడు, సింగర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతి పార్టీకి, రాష్ర్టానికి తీరని లోటని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. కుభీర్‌లో సాయిచంద్ చిత్ర పటానికి గురువారం పూలమాల వేసి రెండు నిమిషా లు మౌనం పాటించి నివాళులర్పించారు. సాయిచం ద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్య క్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యమ గాయకుడికి ఘన నివాళి
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 29: జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి నివాసంలో మలి దశ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్‌కు ఘన నివాళులర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప సాయి చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో సా యి చంద్ పాటలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో సాయి చంద్ పాత్ర మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావు, జడ్పీటీసీ అరుణ, యువ నాయకుడు కోవ సాయినాథ్, సోనేరావు, నాయకులు జీవన్, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.