ఆదిలాబాద్, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గత సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేయనున్నారు. అభ్యర్థులను ప్రకటించడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల నుంచి దండిగా మద్దతు లభిస్తోంది. ఇండ్లు, కార్యాలయాలు ఉదయం నుంచి రాత్రి వరకు సందడిగా మారుతున్నాయి. అభ్యర్థులను కలుస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదరణను చూసి ప్రతిపక్షాల నాయకులు బెంబేలెత్తిపోతు న్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకుసాగుతామని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. బీఆర్ఎస్ను తమ ఇంటి పార్టీగా భావిస్తూ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల పాలిట వరంగా మారాయి. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ స్కూళ్లు, దళితబంధు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, బీసీలకు రూ.లక్ష సాయం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు, రేషన్ బియ్యం పంపిణీ తదితర పథకాల ఫలితంగా గ్రామాల్లో పేదల ఉపాధి ఎంతో మెరుగుపడింది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు తమ గ్రామాల్లో ఉపాధి పొందుతూ కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు జిల్లాకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. సర్కారు అందిస్తున్న సాయంతో పదేండ్లుగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు.
వెల్లువెత్తుతున్న మద్దతు..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వస్తున్న వారిని సన్మానిస్తున్నారు. నాయకులు, ప్రజల రాకతో ఎమ్మెల్యే అభ్యర్థుల ఇండ్లు, క్యాంపు కార్యాలయ వద్ద సందడి నెలకొంది. అభ్యర్థులను కలిసి తమ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించేలా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలో టికెట్ కోసం వర్గపోరు తీవ్రంగా ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశం ఇరువర్గాల మధ్య గందరగోళానికి దారి తీసింది. బీజేపీలో సైతం ఎమ్మెల్యే టికెట్ తమకే వస్తుందని ఇరువర్గాల నాయకులు అంటున్నారు. ఈ రెండు పార్టీల్లో వర్గపోరు కారణంగా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థుల భారీ విజయం కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు.