మంచిర్యాల, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించగా, నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ కనిపించింది. ఇటీవల క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేసిన నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎక్కడ చూసినా ఆయన ప్రసంగం గురించే చర్చ నడుస్తున్నది. ఆయా చోట్ల జనసంద్రాన్ని చూసి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కేడర్‌లో నూతనోత్సాహం
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ, చైర్మన్ పీఠం దక్కించుకోడానికి అధికార పార్టీ సాగించిన అరాచకపర్వాన్ని యావత్ తెలంగాణ చూసింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి.. నాయకుడు లేని కౌన్సిలర్లను చెదరగొట్టాలని కుట్రలు చేసింది. అధికార బలాన్ని ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేసింది. ఖాళీ చెక్కులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూసింది. ఇంత చేసినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదు.. బెదరలేదు.. లొంగలేదు. చివరకు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.
చరిత్రలో నిలిచిపోయేలా 51 రోజుల సుదీర్ఘ పోరాటం చేసి, రాష్ట్రం మొత్తం క్యాతన్‌పల్లి వైపు చూస్తున్న సమయంలో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం మంచిర్యాల జిల్లా శ్రే ణుల్లో జోష్ నింపింది. అలుపెరుగని పోరాటం చేసి న క్యాతన్‌పల్లి కౌన్సిలర్లను సైనికులుగా పోలుస్తూ.. ప్రజాతీర్పునకు కట్టుబడాల్సిందేనని బీఆర్ఎస్ వైపు నిలబడిన స్థానిక ప్రజానీకానికి సెల్యూట్ చేస్తున్నానంటూ కేటీఆర్ ప్రకటించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ బీఆర్ఎస్ విజేతలను ప్రత్యేకంగా సన్నానించారు. కాంగ్రెస్ అరాచకాలను ఎండగడుతూ పార్టీ కార్యకర్తలకు మేమున్నామంటూ ధైర్యం కల్పించారు. క్యాతన్‌పల్లి సహా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న నీచ రాజకీయాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై అగ్గిపుట్టిస్తామంటూ చేసిన హెచ్చరికలు బీఆర్ఎస్ కేడర్‌లో నూతనోత్సాహం నింపాయి.
క్యాతన్‌పల్లి నుంచే కీలక ప్రకటనలు..
ప్రజాతీర్పునకు గెలిపించడం కోసం క్యాతన్‌పల్లి కేంద్రంగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. ఈ తరుణంలో మంచిర్యాల జిల్లాకు వచ్చిన కేటీఆర్ క్యాతన్‌పల్లి నుంచి పార్టీకి సంబంధించిన కీలక ప్రకటనలు చేయడం.. స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో తొలిసారి ఓ జిల్లా పర్యటనలో కేటీఆర్ మీడియాతో దాదాపు గంటన్నర పాటు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
బీఆర్ఎస్లో కిందిస్థాయి నుంచి కీలక స్థాయి దాకా ఉన్న నేతలకు క్యాతన్‌పల్లి వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని, మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవని, మా కుటుంబంలో, నాయకత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇకపై పార్టీ వ్యవహారాల్లో కొంత కఠినంగా వ్యవహరించక తప్పదని, క్షేత్రస్థాయిలో ప్రతీ కార్యకర్త వచ్చి పార్టీలో ఏం జరుగుతుందో అదినాయకత్వానికి చెప్పుకునేలా అంతర్గత నిర్మాణం ఉండబోతుందని చెప్పారు. గెలుపు గుర్రాలు.. ప్రజల్లో ఉన్నవారికే టికెట్లు ఇస్తామంటూ కుండబద్ధలు కొట్టారు. బీజేపీతో పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు.
మాకు పొత్తు అవసరమే లేదని.. సొంత పోటీ చేసి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గాలు పెరిగితే తమ పార్టీకి లాభమే తప్ప నష్టం లేదని.. మా నాయకులందరూ పోటీ చేస్తారన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారో అక్కడ పోటీ చేస్తారని.. పార్టీ కోసం తాను సిరిసిల్లను వదిలి వేరే చోట పోటీ చేయాల్సి వస్తే కచ్చితంగా చేస్తానని.. ఇదే నిబంధన అందరికీ వర్తిస్తుందని చెప్పారు. గత పాలనలో ఉన్న చిన్నచిన్న లోటుపాట్లను గుర్తించామని, రానున్న రోజుల్లో ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లో పని చేసి, గతంలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చాయని, కవిత కొత్త పార్టీ పెట్టారని జరుగుతున్న ప్రచారంపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించి.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్న సందేహాలకు క్యాతన్‌పల్లి వేదికగా సమాధానాలు ఇచ్చారు.
బీఆర్ఎస్తోనే ఉమ్మడి ఆదిలాబాద్‌కు మంచిరోజులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కేటీఆర్ పూర్తి క్లారిటీతో మాట్లాడారు. పార్టీ నాయకత్వంలో సమన్వయంపై స్పష్టత ఇచ్చారు. నియోజకవర్గాలు పెరిగితే ఉమ్మడి ఆదిలాబాద్‌లో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల సాగునీటి ఇబ్బందులు తొలిగాలంటే తుమ్మిడిహెట్టి ఒక్కటే మార్గం కాదన్నారు. దానికి మహారాష్ట్ర ఒప్పుకునే అవకాశం లేదని.. అందుకే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల పక్కనే ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదుల నుంచి నీళ్లను రైతుల భూముల్లోకి మళ్లించే బాధ్యత వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను తీసుకుంటానని చెప్పారు.
ఉన్న నీటి వనరులను ఒడిసిపట్టేందుకు ఎక్కడ అవసరమైతే.. అక్కడ లిప్ట్ ఇరిగేషన్లు, బరాజ్‌లు కట్టుకునేలా ప్లాన్ చేస్తామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌తో వస్తున్న ఇబ్బందులు, 1/70 యాక్ట్‌తో వస్తున్న సమస్యలు, స్థానిక సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాల సమస్యలు, సింగరేణి పట్టాలు, ఉద్యోగాల కల్పన.. ఇలా అనేక అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్లు కేటీఆర్ మాటల్లోనే తెలిసి పోయింది. రికార్డు సమయం పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచిర్యాల జిల్లానే అంటిపెట్టుకొని ఉన్న కేటీఆర్.. 2028లో బీఆర్ఎస్ సర్కార్ వస్తేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంచిరోజులు వస్తాయన్న ధీమా కల్పించడంలో, ప్రజల్లో చర్చకు వచ్చేలా చేయడంలో సఫలమయ్యారు. క్యాతన్‌పల్లి స్ఫూర్తితో మరిన్ని ప్రజాపోరాటాలు చేసేలా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలో నయా జోష్ నింపారు.
సింప్లీ సూపర్.. మాస్ లీడర్ కేటీఆర్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జర్నలిస్టు, మేధావి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. క్యాతన్‌పల్లిలోని బాల్కసుమన్ నివాసంలో ఆదివారం సాయంత్రం దాదాపు రెండు గంటలపాటు కేటీఆర్ మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్న, ఈ ఇంటరాక్షన్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రతీ ప్రశ్నకు కేటీఆర్ ఓపికగా సమాధానం ఇచ్చారు. ప్రపంచ స్థాయి వేదికలపై, హైదరాబాద్‌లో నిర్వహించే ప్రెస్టిజియస్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే కేటీఆర్ కావాలనుకుంటే ఛానళ్లు, పేపర్ల సీఈవోలు, ఎడిటర్లతో సమావేశం కాగలరు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి అతి సామాన్యుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జర్నలిస్టులతో మాట్లాడటం, దాదాపు రెండు గంటల పాటు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలు చెప్పడం, ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ.. అద్భుతమైన రీతిలో స్పందించడం ఆకట్టుకున్నది. పార్టీ అంతర్గత వ్యవహారాలు మొదలుకొని, జర్నలిస్టులు అడిగిన ప్రతీ పశ్నపై కేటీఆర్ క్లారిటీ ఇస్తూ ఆదిలాబాద్ జిల్లా జర్నలిస్టుల గౌరవాన్ని పెంచారన్న చర్చ జరుగుతున్నది. మీడియా ఇంటరాక్షన్ అనంతరం దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు చెన్నూర్ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఫొటోలు దిగారు. ఓపికగా ఏ ఒక్కరినీ వద్దు అనకుండా వచ్చిన ప్రతి ఒక్కరితో కేటీఆర్ ఫొటోలు దిగారు. అంతకుముందే తాను గూగుల్ సీఈవోతో సమావేశమం కాగలనని, అవసరమైతే గుడిసెలో ఉండే పేదవాళ్లతోనూ మాట్లాడగలనంటూ మీడియాతో కేటీఆర్ చెప్పినట్లుగానే ఆయన వ్యవహారశైలి ఉండటం.. క్లాస్‌తో పాటు మాస్ లీడర్‌గా ఆయన వ్యవహరించగలరన్న సందేశాన్ని ఇచ్చింది.