ఆదిలాబాద్ జిల్లాలోని రైతుల సమస్యలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, యువనేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) నేడు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించ నున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకొని పత్తి, సోయా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాల యంలో జరిగే విలేకరుల సమావేశంలో మాట్లాడుతారని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
– ఆదిలాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ)
సీసీఐ కొంటున్నా.. దక్కని మద్దతు ధర..
ఈ ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంంలో మొదటి నుంచి రైతులకు నష్టాన్ని కలిగించే నిబంధనలు అమలు చేస్తున్నది. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పంటను సేకరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా లేక యాప్ పని చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 చొప్పున కొనుగోలు చేస్తున్నది. పంటలో తేమ శాతం 8 ఉంటేనే ఈ ధర చెల్లిస్తున్నది. ఈ తర్వాత ఒక్కో శాతానికి రూ.81 తగ్గిస్తూ 12 శాతం వరకు మాత్రమే కొంటున్నది.
12 శాతం కంటే ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తేమ బాగా పడుతున్నది. దీంతో రైతులు పత్తిని ఎండబెట్టినా తేమ శాతం తగ్గడం లేదు. సీసీఐ అధికారులు తిరస్కరించిన పంటను రైతులు మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసి ఎండబెట్టి రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. మూడు, నాలుగు రోజులైన మంచు కారణంగా పంటలో సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.6800 చొప్పున విక్రయించి క్వింటాలుకు రూ.1300 నష్టపోతున్నారు.
అధికార పార్టీ నాయకులకు పట్టింపేదీ?
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయాబిన్ పంటలను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్లలో సీసీఐ, మార్క్ఫెడ్ నిబంధనల కారణంగా మద్దతు ధరలు లభించడం లేదు. స్లాట్ బుకింగ్ విధానంతో సీసీఐ పత్తిలో ఎనిమిది శాతం తేమ ఉంటేనే మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 చెల్లిస్తున్నది. ఎకరాకు ఏడు క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పత్తిని ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.1300 తక్కువకు విక్రయించి నష్టపోతున్నారు. సోయాబిన్ను ఎకరాకు ఏడు క్వింటాళ్లు కొనడంతోపాటు చెత్తా, చెదారం ఉందంటూ పంటను కొనుగోలు చేయడం లేదు.
20 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నా.. కేంద్రంలోని అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోలేదు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సీసీఐ అధికారులను కలిసి పత్తి కొనుగోళ్లలో తేమ శాతం సడలించాలని, ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తి వేయాలని వినతిపత్రం ఇచ్చారు. రైతులు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు జిల్లాలో యువనేత కేటీఆర్ పర్యటించనున్నారు. ఈనెల 21న అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళనలు చేయనున్నారు.
జిన్నింగ్ మిల్లుల మూసివేత
పత్తి కొనుగోళ్లలో సీసీఐ వైఖరికి నిరసనగా జిన్నింగ్ వ్యాపారులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఇందులో భాగంగా జిన్నింగ్ మిల్లులను మూసి వేశారు. నిత్యం పత్తి వాహనాలు, రైతులతో సందడిగా కనిపించే ఆదిలాబాద్ మార్కెట్ యార్డు బోసి పోయింది. పంట అమ్మడానికి సోమవారం స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు కొనుగోళ్లు లేకపోవడంతో ఆందోళన చెందారు. ప్రభుత్వం సమస్యను తొందరగా పరిష్కరించి పత్తి కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్.