మంచిర్యాల టౌన్, జూలై 5 : ఈ నెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షెట్టిపేటకు రానున్నారని, సర్కారు నిర్లక్ష్యంతో రెండు నెలల క్రితం మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పార్టీ పరంగా ఆర్థిక సాయం అందించనున్నారని, ఆపై రైతు సభలో పాల్గొంటారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివాకర్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచుతున్నదని, అడుగడుగునా రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు విత్తనాలు, యూరియా, మద్దతు ధర అందడం లేదని, కొనుగోళ్లు జరుగడం లేదని, సాగునీరు అందించడం లేదని.. ఇలా అనేక అంశాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇదే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టారని, సాగునీరు అందించడం, విత్తనాలు, యూరియా సరిపడా ఇవ్వడం, పండించిన పంటలకు మద్దతుధర అందించడం చేశారన్నారు. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పేరుతో ఎకరానికి రూ. 12 వేలు అందించారని, రైతుబీమా పథకాన్ని అమలు చేశారని అన్నారు. కానీ, కాంగ్రెస్ నాయకులు ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, మద్దతు ధర ఇవ్వడంలేదని, యూరియా అందించడం లేదని విమర్శించారు.
రెండు నెలల క్రితం లక్షెట్టిపేట మండలంలో పండించిన పంటలను కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డ నలుగురు రైతులకు ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదన్నారు. నలుగురు రైతులు చనిపోతే కనీసం కలెక్టర్ అక్కడికి వచ్చి చూడలేదని, కేవలం ఎమ్మెల్యే సూచన మేరకే ఆయన రాలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పీఎస్సార్ రైతులను నిలువునా ముంచుతున్నాడని, బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తరుగుపేరుతో తీసుకుని రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు దండుకుంటున్నాడని విమర్శించారు.
మంచిర్యాలలో నిర్మించిన మహాప్రస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఇందుకు ఎమ్మెల్యే పీఎస్సారే సూత్రధారి అని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. నాలుగున్నర కోట్ల అంచనాతో నిర్మించాల్సిన మహాప్రస్థానాన్ని రూ. 14 కోట్లకు పెంచారని, ఈ సొమ్మంతా ఎమ్మెల్యే ఖాతాలోకే పోయిందని అన్నారు. భూదాన్భూమిలో మట్టి నింపడానికి గోదావరి నదిలోనుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఆధారాలతో సహా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. మహాప్రస్థానంలో 40 వేల మొక్కలు నాటినట్లు చెబుతున్నారని, ఇది ప్రజలే గమనించాలని కోరారు.
నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాల్లో నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని అన్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వెచ్చించి నిర్మించిన మహాప్రస్థానాన్ని సొసైటీ నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మధ్యలో సొసైటీ ఎందుకు వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చిందని, ఇందులో సభ్యులు ఎవరని మండిపడ్డారు. శ్మశానవాటికను పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిపించాలని, దాని నిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, నాయకులు గాదెసత్యం, అక్కూరి సుబ్బయ్య, పోడేటి శ్రీనివాస గౌడ్, మందపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, తదితరులు పాల్గొన్నారు.