మంచిర్యాల, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. శనివారం మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు వేర్వేరుగా పరిశీలించి, శ్రేణులకు సలహాలు, సూచనలు చేశారు. బీఆర్ఎస్ భవన్లో చేస్తున్న ఏర్పాట్లపై పట్టణ కమిటీ నాయకులతో చర్చించారు. శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికి, పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేదిక, షామియానాలు, తాగునీరు, సౌండ్ సిస్టం, జనరేటర్, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు.
కేటీఆర్ పర్యటన
ఉదయం 11.30 గంటలు : మంచిర్యాల జిల్లా గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలు : మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇంట్లో టీ-పార్టీకి హాజరవుతారు.
మధ్యాహ్నం 12.30 గంటలు : నస్పూర్‌లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను సన్మానిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలు : క్యాతన్‌పల్లి ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరవుతారు.
మధ్యాహ్నం 2.30 గంటలు : క్యాతన్‌పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నివాసానికి చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.