బజార్హత్నూర్, డిసెంబర్ 5: తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నామినేషన్లు, ఓట్లు వేసేది లేదంటూ శుక్రవారం బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన కొత్తపల్లి ప్రజలు నిరసన తెలిపారు. మూడవ విడుత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ గిర్నూర్లోని 9వ వార్డు కొత్తపల్లి గ్రామస్తులెవరూ నామినేషన్లు వేయబోమని భిష్మించుకూర్చున్నారు. గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్నట్లే కానీ తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయనప్పుడు తాము నామినేషన్లు, ఓట్లు వేసి ఏమి ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఐ సంజయ్‌కుమార్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించి గ్రామాభివృద్ధికి తోడ్పాడే విధంగా చర్యలు తీసుకుంటామని సముదాయించడంతో సాయంత్రం వేళ గ్రామస్తులందరూ కలిసి వెళ్లి చివరి సమయంలో 9వార్డుకు నామినేషన్లు దాఖలు చేశారు.