కౌటాల, సెప్టెంబర్ 25 : సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చేరగా, వారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గతేడాది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కోనప్ప కాంగ్రెస్‌లో చేరారు. ఏడాది పూర్తి కాకుండానే అధికార పార్టీని వీడారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రావి శ్రీనివాస్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేయగా, తాజాగా వీరిద్దరు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ వర్గం మాత్రమే ఉన్నది. కోనేరు బ్రదర్స్ చేరికతో కౌటాలలోని కుమ్రం భీం చౌరస్తాలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మాంతయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు పటాకులు పేల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. మాజీ సర్పంచ్ మౌనిష్, మాజీ ఎంపీటీసీ ఎంకే మండల్, నాయకులు సంతోష్, రవీందర్ గౌడ్, తిరుపతి, డబ్బా బాపు, ప్రభాకర్ గౌడ్ ఉన్నారు.