ఆసిఫాబాద్ : ఎగువన కురిసిన వర్షానికి కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాగు దాటలేక ఉపాధ్యాయులు బడిలోనే రాత్రంతా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. అత్యంత మారుమూల గ్రామాలైన వాడిగొంది, చెల్కగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు స్వాతి, సుమలత, నైతం హరిప్రకాష్, కుర్చెంగ జాలింషాలు విధులు ముగిసిన అనంతరం ఆసిఫాబాద్‌కు ప్రయాణమయ్యారు.
దారిలో వాగు ఉప్పొంగడంతో గంటల తరబడి నిరీక్షించి చేసేదేమి లేక చెల్కగూడ గ్రామ ప్రాథమిక పాఠశాలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. రాత్రి అక్కడే బస చేశారు. గ్రామస్తులు వారికి సౌకర్యాలు కల్పించారు. చెల్కగూడలో ఫోన్ సిగ్నల్స్ కూడా తక్కువగా ఉండటంతో ఎప్పటికప్పుడు సమాచారం అందకపోవడంతో ఇబ్బంది పడ్డారు.