కుమ్రం భీం ఆసిఫాబాద్ : ప్రతి నిత్యం యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని లింబిని దీక్ష భూమిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా మనదేశం నుంచి ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని, జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్ లో త్వరలో యోగా తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.
పాఠశాలలో కూడా యోగా తరగతులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్ నోడల్ అధికారి వాణి, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.