శ్రీరాంపూర్, జూన్ 14: టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌తోనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తెలిపారు. శ్రీరాంపూర్ ఆర్కే-6గనిపై ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లయ్య మాట్లాడారు. రాజకీయ జోక్యం లేనిదే ఏ యూనియన్ మనుగడ కొనసాగించలేదన్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారిటోరియం కల్పించడంతో నేడు లాభాల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ కూడా సీపీఐకి అనుబంధమేనని, వారి కాలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నాటి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ నుంచి ప్రస్తుతం కూనమనేని సాంబశివరావు దాకా పాల్గొన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఐఎన్టీయూసీతో కలిసే ముందుకుసాగారని వివరించారు. బీఎంఎస్ నాయకులు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సింగరేణిలో తిరిగారని చెప్పారు. జాతీయ సంఘాల ప్రతినిధులు ఇక్కడ పర్యటిస్తే తప్పులేదు కాని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తిరిగితే తప్పుబట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వాన్ని కలిసి హక్కులు సాధిస్తున్నారే తప్పా పోగొట్టడం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు లేని కార్మిక సంఘం ఏఐటీయూసీతో కార్మిక వర్గానికి నయా పైసా లాభం లేదని విమర్శించారు. కార్మికులకు అనేక హక్కులు కల్పించిన ఘనత టీబీజీకేఎస్‌కు దక్కుతున్నదని వివరించారు. కార్మికుల హక్కులు పోగొట్టిన పాపం ఏఐటీయూసీ ఒడిగట్టుకుందని ఆరోపించారు. కార్మికులు జాతీయ కార్మిక సంఘాల తప్పుడు ప్రచారం నమ్మరని చెప్పారు. సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు పెట్టం లక్షణ్, వెంగళ కుమారస్వామి, పోశెట్టి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు అడ్డు శ్రీనివాస్, జగదీశ్వర్‌రెడ్డి, పిట్ కార్యదర్శి రాయమల్లు నాయకులు రమేశ్, భూమయ్య, రాజయ్య, సత్తయ్య, సంతోష్, మెండ వెంకటి, బన్న వెంకటి పాల్గొన్నారు.
రాజకీయ జోక్యంతోనే హక్కులు
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యంతోనే కార్మికుల హక్కులు సాధిస్తున్నామని మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ స్పష్టం చేశారు. మందమర్రి ఏరియా శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఆవరణలో మంగళవారం టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌కు హాజరై కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, ఏరియా నాయకులు వెంకటరమణతో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే వారసత్వ ఉద్యోగాలు, డిస్మిసల్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, ఇతర సదుపాయాలు వస్తున్నాయని వివరించారు. సింగరేణి నిధులు ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 శాతం నిధులు సింగరేణేతర ప్రాంతాలకు బదలాయించవచ్చనే నిబంధనలు వివరించకుండా కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న ప్రజల ఎన్నో ఏండ్ల కల నెరవేరనున్నదని, త్వరలోనే పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుదని తెలిపారు. గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో రీజియన్ కమిటీ సభ్యుడు ఓ రాజశేఖర్, శంకర్రావు, రాజనాల రమేశ్,చిలుక రాజనర్సు, సిద్ధంశెట్టి సాజన్, ఆవుల రవికిరణ్ పాల్గొన్నారు.