బేల, ఫిబ్రవరి 3 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య సమావేశ మందిరంలో 41 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు కాగా, లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. అనంతరం ఎంపీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్నను ఎంపీపీ వనిత ఠాక్రే, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కే ప్రమోద్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్, బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు సతీశ్ పవర్, తన్వీర్ ఖాన్, మధుకర్ గోడే, సంతోష్ బెదుడ్కర్, డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐలు నారాయణ్, గీత, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. వార్డువాచ్లో భాగంగా పట్టణంలోని ఖుర్షీద్‌నగర్, వడ్డెరకాలనీల్లో గురువారం పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. వడ్డెరకాలనీలో మిషన్‌భగీరథ పైప్‌లైన్ లీకేజీలను సరిచేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశామని, ఇంకా ఏమైనా రోడ్లు మిగిలి ఉంటే త్వరలోనే వాటికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అంతకు ముందుకు ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వా గతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, అశ్రఫ్, కౌన్సిలర్లు బండారి సతీశ్, సలీం ఇమ్రాన్, బుట్టి శివకుమార్, ఈఈ వెంకట శేషయ్య పాల్గొన్నారు.
పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. హరితహారం, మిషన్‌భగీరథ, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శైలజ, ఈఈ వెంకట శేషయ్య, డీఈ తిరుపతి, ఫ్లోర్‌లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ అజయ్ పాల్గొన్నారు.