నిర్మల్ జిల్లాలో సత్ఫలితాలిస్తున్న సేవలు
ఇప్పటి వరకు 316 మంది బాధితులకు న్యాయం
అండగా నిలుస్తున్న పోలీసుశాఖ
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు 181, 8500540181 ఏర్పాటు
నిర్మల్ అర్బన్ ఏప్రిల్ 25 : నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, యువతులపై భౌతిక, లైంగిక దాడులు, వేధింపులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు నిర్మల్ సఖీ కేంద్రం చర్యలు తీసుకున్నది. మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో సఖీ అందిస్తున్న సేవలపై అవగాహన క్యాంపులు నిర్వహిస్తూ వారిలో ఆత్మైస్థెర్యం నింపుతున్నారు. జిల్లాలో రెండేండ్లలో 19 మండలాల్లో ఇప్పటి వరకు 529 అవగాహన క్యాంపులు నిర్వహించారు. మొత్తం 38,767 మంది మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను బయటకు చెప్పుకోలేని వారు సఖీ కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కేంద్రంలో నేరుగా, టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదులు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచి సమస్యలను పరిష్కరిస్తూ సహాయాన్ని అందిస్తున్నారు. సఖీ కేంద్రం నిర్వాహకురాలు మమత తమ కింది స్థాయి సిబ్బందిని సమన్వయ పరుస్తూ 24 గంటల పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కేసులను త్వరగా పరిష్కరిస్తున్నారు. సిబ్బంది సహకారంతో మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా న్యాయ సలహాలు, పోలీసు, వైద్య సహాయం అందిస్తూ బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
జిల్లాలో కేసుల పరిష్కారం ఇలా..
జిల్లాలో మహిళలపై దాడులు, లైంగికదాడులు పెరిగిపోతుండడంతో మహిళల రక్షణకు అండగా ఉం డేందుకు 2019, మే 18వ తేదీన జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 250 ఫిర్యాదులను ప్రత్యక్షంగా స్వీకరించగా.. 181 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా 49, పోలీసు స్టేషన్ ద్వారా 68, ఇతరవి 57 కలిపి మొత్తం 424 ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 316 కేసులు పరిష్కరించారు. మరో 108 పరిష్కార మార్గంలో ఉన్నా యి. ఇందులో గృహహింస కింద 318 నమోదు కా గా, లైంగికదాడులు, వేధింపులకు సంబంధించినవి 7, చిన్నారులపై (పోక్సో యాక్టు) లైంగిక దాడులు, బాల్య వివాహాల నిరోధం కింద 7, చీటిం గ్, ప్రేమ వివాహాలు 38, వరకట్న వేధింపులు 13, 28 ఇతర కేసులు నమోదు చేసి సమస్య పరిష్కరించారు.
అవగాహన కార్యక్రమాలు, చైతన్య సదస్సులు..
మహిళలపై నిత్యం జరుగుతున్న దాడులను తిప్పి కొట్టడానికి, మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంటూ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల్లోని గ్రామీణ, మండల కేంద్రాల్లో సఖీ సిబ్బంది అవగాహన కల్పించడమే కాకుండా హింసలకు గురవుతున్న మహిళలకు న్యాయం చేస్తున్నారు. ప్రతిరోజూ సఖీ కేంద్రంలోని సిబ్బందిలో కొంత మంది అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్, కేసుల పరిష్కారం వంటి విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 1,353 మందికి సైకాలజీ కౌన్సెలింగ్ ఇచ్చారు. 40 లీగల్ కౌన్సెలింగ్, 78 కేసులు పోలీసుల ద్వారా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. 67 మందికి సఖీ కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.16 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 ఎమర్జెన్సీ రెస్క్యూ కేసులు, 18 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. కొవిడ్ సమయంలో 117 టెలీ ప్రోగ్రామ్‌లను నిర్వహించి సర్పంచ్‌లకు సఖీ సేవలపై అవగాహన కల్పించారు. రంగోలీ, మహిళా దినోత్సవం, సమతాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీల్లో మహిళలను భాగస్వాములు చేస్తున్నారు.