ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 25: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి సాంబశివ రావు అన్నారు. వానలు పడుతున్నందున ఎవరు కూడా చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల, కుంటలు, వాగులో చేపల వేటకు, చేపల వలలు తీయడానికి వెళ్లకూడదని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు మూడు రోజుల పాటు జిల్లాకు వర్ష సూచన ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సాంబశివ రావు హెచ్చరించారు. సరదాకోసం ఎవరైనా ప్రాజెక్టులు, చెరువుల, వాగుల వద్దకు వెళ్లి చిక్కుకుంటే వారిని కాపాడాలని గజ ఈతగాళ్లకు సూచించారు. వర్షాల ప్రభావం తగ్గే వరకూ అధికారుల సూచనలు అందరూ పాటించాలని ఆయన పేర్కొన్నారు.