కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఎన్నికల సమయంలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు లోను కాకుండా సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 5కె రన్ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా తిరిగి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్, జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు బూత్ స్థాయి అధికారులు, ఆన్లైన్లో ఫారం 6 ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రలోభాలకు, ఒత్తిడు లకు లోను కాకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన వరమని, ఈ హక్కును సద్వినియోగం చేసుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు.
దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయాలలో ఓటు హక్కు ఎంతో విలువైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కోసం ప్రభుత్వం అవకాశం కల్పిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల వసతులు కల్పించామని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు తమ వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని, ఎన్నికల సమయంలో వినియోగించుకోవాలని తెలిపారు.