చెన్నూర్ రూరల్, జూన్ 14: గ్రామాల్లో పరిసరాల శుభ్రత పాటించాలని గ్రామస్తులకు జిల్లా అదనపు కలెక్టర్ మధూసూదన్ నాయక్ సూచించారు. మంగళవారం చెన్నూర్ మండలంలోని సోమన్‌పల్లిలో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. బృహత్ ప్రకృతి వనాన్ని సందర్శించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.రోడ్లపై చెత్త వేసే కిరాణా షాపు నిర్వాహకులకు జరిమానా విధించాలని ఆదేశించారు. ఆయన వెంట చెన్నూర్ ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ భీమిని శారద, పంచాయతీ కార్యదర్శి తిరుమల, నాయకులు భీమిని శ్రీనివాస్ గౌడ్. తుమ్మల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలంలో..
మండల కేంద్రంలో పల్లె ప్రగతి పనులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. మురుగు కాలువల వద్ద గడ్డి పెరగడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం క్రీడా ప్రాంగాణాన్ని పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీవో బాలయ్య, సర్పంచ్ సువర్ణ తదితరులున్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, సర్వాయిపేటలో పల్లెప్రగతి కార్యక్రమాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. పారుపల్లి, లింగన్నపేట, ఎదుల్ల బంధం, రొయ్యలపల్లి, పుల్లగామలో క్రీడా ప్రాంగణాలను డీఆర్డీవో శేషాద్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే భాస్కర్, తహసీల్దార్ సునీల్, ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నస్పూర్ పట్టణంలో..
నస్పూర్ మున్సిపాలిటీలో 2, 21వ వార్డుల్లో పారిశుధ్య పనులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్ బేర సత్యనారాయణ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజలింగు, మున్సిపల్ సిబ్బంది, ఆయా వార్డు ప్రజలు పాల్గొన్నారు.
వేమనపల్లి మండలంలో..
మండలంలోని నీల్వాయి, కేతనపల్లి, వేమనపల్లిలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పర్యటించారు. పారిశుధ్య పనులు, క్రీడా మైదానాల నిర్మాణ పనులను పరిశీలించారు. వేమనపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ క్లర్క్‌కు షోకాజ్ నోటీసులివ్వాలని ఎంఈవో తిరుపతిరెడ్డి ఆదేశించారు. వంట గది అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్‌కుమార్, ఎంపీవో బాపురావు, సర్పంచ్ గాలి మధు, పంచాయతీ కార్యదర్శులు అశోక్, శ్యాం, వెంకటేశ్, సంతోష్, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. నాగారం, సూరారం గ్రామాల్లోని క్రీడా మైదానాల పనులను ఎంపీవో బాపురావు పరిశీలించారు.
మంచిర్యాల పట్టణంలో..
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 23, 24 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు బానేశ్, సంజీవ్ వార్డుల్లో పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ నర్సింహస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్‌రాథోడ్, టీఆర్ఎస్ నాయకులు కే చంద్రమౌళి, మనోహర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణంలో..
మందమర్రిలో పట్టణంలో ఒకటో వార్డు యాపల్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మున్సిపల్ ఏఈ అచ్యుత్, 1వ వార్డు ప్రత్యేక అధికారి, మెప్మా టీఎంసీ ఏనుగు రఘురాం, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండీ అబ్బాస్ పర్యటించారు. పారిశుధ్య పనులు చేయించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు సమన్వయకర్తలు రమాదేవి, అమృత, వార్డు అధ్యక్షుడు వనం నర్సయ్య, ఆర్పీ సుజాత తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట పట్టణంలో..
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 9,12వ వార్డుల్లో డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను, ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, కౌ న్సిలర్లు శ్రీకాంత్ మున్సిపల్ మేనేజర్ శ్రీహరి పరిశీలించారు.
బెల్లంపల్లి పట్టణంలో..
మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి మెయిన్‌రోడ్డు పక్కన చెత్తకుప్పలను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తొలగించేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ సందీప్, టీవో ఆశ్రిత్, హెల్త్ అసిస్టెంట్ ఉదయ్‌కిరణ్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, హెల్త్ అసిస్టెంట్లు సురేందర్, జీవన్, శ్రీనివాస్ తదితరులున్నారు.
హాజీపూర్ మండలంలో..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం హాజీపూర్ మండలంలోని వేంపల్లిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను డీఎల్పీవో రవీందర్ పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి ప్రతిభ తదితరులున్నారు.
రోడ్డుపై చెత్త వేసినందుకు జరిమానా
రోడ్డు పై చెత్త వేసిన దుకాణా దారుడికి రూ.3 వేల జరిమానాను జిల్లా పంచాయతీ అధికారి నారాయణ విధించారు. మండలంలోని ఆవుడంలో పారిశుధ్య పనులు పరిశీలించారు. దుకాణం ముందు చెత్త కనిపించడంతో జరిమానా విధించారు. ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ సత్తమ్మ ఉన్నారు.