కోటపల్లి, జూన్ 14 : వర్షాకాలం వచ్చిందంటే వారి పరిస్థితి అగమ్యగోచరం. మూడు నెలలపాటు జలదిగ్బంధంలో 10 గ్రామాల ప్రజలు ఉండాల్సిన దుస్థితి. ఇక్కడి ప్రజల సమస్యలను వచ్చి చూసిన వారే కానీ.. పరిష్కారించిన వారు కానరాలేదు. అత్యవసర సమయాల్లో ఆ గ్రామాల ప్రజల పరిస్థతి దయనీయం. తుంతుంగ వాగు ఉప్పొంగినప్పుడు వాగు దాటుతూ పలువురు కొట్టుకుపోయిన సందర్భాలు లేక పోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 10 గ్రామాల ప్రజలకు విప్ బాల్క సుమన్ నేనున్నానంటూ అభయం ఇచ్చారు. కష్టాలను కళ్లారా చూసిన ఆయన ఏడాదిలోగా వారి సమస్యకు బ్రిడ్జి రూపంతో పరిష్కార మార్గం చూపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు మం జూరు చేయించడంతోపాటు వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేయించి అందరి మన్ననలు పొందుతున్నారు.
వాగు ఉప్పొంగితే..
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎదుల్ల బంధం సమీపంలోని తుంతుంగ వాగుపై బ్రిడ్జి లేక ప్రజల కష్టాలు వర్ణనాతీతం. భారీ వర్షాలు కురిసినపుడు వాగు ఉప్పొంగితే.. ప్రవాహం అవతల ఉన్న ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, వెంచపల్లి, నందరాంపల్లి గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఉండేవారు. రాకపోకలు పూర్తిగా స్తంభించేవి. ఎలాంటి కష్టం వచ్చినా నీటి ప్ర వాహం దాటే ఆస్కారం లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు. యేటా 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, వారి కష్టాలను 2020, ఆగస్టు 17న ప్రభుత్వ విప్ స్వయంగా చూశారు. అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ విప్ సుమన్ ప్రత్యేక చొరవ..
తుంతుంగ వాగుపై బ్రిడ్జి లేక యేటా ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు తుంతుంగా చెరువు మత్తడి ఉధృతంగా ప్రవహించింది. సూపాక గ్రామానికి చెందిన శ్రీలత అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. వాగు ఒడ్డు వద్దే ఉండిపోయింది. పురిటి నొప్పులు పెరుగుతుండగా, రం గంలోకి అప్పటి సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్‌లతోపాటు ఎంపీటీసీ జేక శేఖర్, సర్పంచ్ పెద్దింటి పున్నంచంద్ అతికష్టంమీద ట్రాక్టర్ సాయంతో గర్భిణిని వాగు దాటించారు. ఈ ఘటనలో పోలీసులు చేసిన సాహసానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, విప్ బాల్క సుమన్, డీజీపీ మహేందర్ కోటపల్లి పోలీస్ సేవలను అభినందించారు. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావించిన విప్ పట్టుదలతో ముందుకు సాగి ఇక్కడి ప్రజల కష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు, రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ. 8 కోట్ల నిధులు మంజూరు కావడంతో 2021 ఏప్రిల్ 27న పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపన అనంతరం జూలైలో పనులు ప్రా రంభించిన కాంట్రాక్టర్ 11 నెలల్లోనే బ్రిడ్జి పూర్తి చేశాడు.
నేడు బ్రిడ్జి ప్రారంభం
ఎదుల్లబంధం సమీపంలో నిర్మించిన తుంతుంగ వాగుపై బ్రిడ్జిని బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌లు ప్రారంభంచనున్నారు. స్థానిక నాయకులు జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు అజ్గర్ మోహియొద్దీన్, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావ్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎరినాగుల ఓదెలు, మండల యూత్ అధ్యక్షులు మారిశెట్టి విద్యాసాగర్, సర్పంచ్‌లు పెద్దింటి పున్నంచంద్, కొఠారి నిర్మల, పూజారి సుమలత, ఎంపీటీసీలు జేక శేఖర్, మారిశెట్టి తిరుపతి, నాయకులు పూజరి బాపు, గోమాస ప్రవీణ్ పరిశీలించారు.
చిరకాలం స్వప్నం నెరవేరింది
కోటపల్లి మండలంలోని తుంతుంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. గత వర్షాకాలంలో ఇక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన. సమస్యకు ఏడాదిలోగా పరిష్కారం చూపెట్టాలనుకున్నా. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తయింది. ఇక్కడి ప్రజల సహకారంతో కోటపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. – బాల్క సుమన్, ప్రభుత్వ విప్