చెన్నూర్, కోటపల్లి మండలాల్లో నీట మునిగిన పంటల పరిశీలన
ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
సీసీసీ సింగరేణి గెస్ట్‌హౌస్‌లో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష
భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
చెన్నూర్, కోటపల్లి, చెన్నూర్ రూరల్ సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి పంటలు నీట మునిగాయని, ఎవరూ అధైర్యపడద్దని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులందరినీ ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భరోసానిచ్చారు. గురువారం చెన్నూర్, చింతలపల్లి, కోటపల్లి మండలం రాంపూర్ గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి, ప్రాణహిత నది సమీపంలోని పంటలు ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం సీసీసీ సింగరేణి గెస్ట్‌హౌస్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భారీ వర్షాలు, వరదలు, పంట నష్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే పంటలు నీట మునుగుతున్నాయన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
భారీ వర్షాలతో పంటలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి మండలాల్లో గోదావరి వరదతో నీట మునిగిన పంట పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. చెన్నూర్ నియోజవకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 2,600 మంది రైతులకు 5,600 పైచిలుకు ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటలు నష్టపోయినట్లు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నష్టంపై బుధవారం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును కలిశామని, గోదావరి, ప్రాణహిత నదుల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని విజప్తి చేశామని ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తికి మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారన్నారు. రెండు, మూడు రోజుల్లో నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం గురించి పూర్తి స్థాయి నివేదికలను అధికారులు తయారు చేస్తారని తెలిపారు. ఇట్టి నివేదికలను సీఎం కేసీఆర్‌కు అందజేసి, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.
నివేదికను వేగవంతంగా రూపొందించాలి
అధికారులతో సమీక్షా సమావేశంలో విప్ బాల్క సుమన్
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 9: రెవెన్యూ, వ్యవసాయం, నీటి పారుదల శాఖల అధికారులు మూడు టీంలుగా ఏర్పడి పంట నష్టాన్ని అంచనా వేసి వీలైనంతా త్వరగా నివేదికలు అందించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. గురువారం సీసీసీ సింగరేణి గెస్ట్‌హౌస్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో భారీ వర్షాలు, వరదలు, పంట నష్టం, తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలకు తో పాటు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్, కోటపల్లి, చెన్నూర్ మండలాల పంట పొలాలు నీట మునిగాయని అన్నారు. పంట పొలాల్లోకి వరదనీరు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి వల్లే పంటలు నీట మునుగుతున్నాయని కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వరదలు వచ్చినప్పుడు అధికారులంతా సెలవులకు దూరంగా ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఉండి, ప్రజలకు మనోధైర్యం కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల రాకుండా వైద్యాధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. మంచిర్యాల జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాజెక్ట్‌తో వరదలు వస్తున్నాయని చెప్పడం అవాస్తవం
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడంతోనే వరదలు వచ్చి పంటలు మునిగిపోతున్నాయనే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఈఎన్సీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రాజెక్ట్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెప్పారు. వరదల వల్ల ప్రాజెక్ట్‌లోకి వచ్చే నీటితో పాటు అదనంగా మరో 20లక్షల కూసెక్యుల నీరు వచ్చి చేసిన సమస్య రాకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రాజెక్ట్‌లను సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.