ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతోఏర్పాటు
నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం
మంత్రి కేటీఆర్ చొరవతో అందుబాటులోకి సేవలు
గురువారం ప్రారంభించిన కలెక్టర్ భారతీ హోళికేరి
మంచిర్యాల, అక్టోబర్ 7, నమస్తే తెలంగాణ/ మంచిర్యాల ఏసీసీ : కరోనాలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సర్కారు అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో ఎన్హెచ్ఏఐ సహకారంతో రూ.80 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నిమిషానికి 500 లీటర్లు ఉత్పత్తి చేయనుండగా, ఒకేసారి 150 పడకలకు సరఫరా చేసే అవకాశమున్నది. కా గా, గురువారం కలెక్టర్ భారతీహోళికేరి ప్రా రంభించగా, సేవలు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో రూ.80 లక్షలతో ఎన్హెచ్ఏఐ, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. రోగులు ఇబ్బందులు పడకూడదని మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, డీఆర్డీవో సహకారంతో దీనిని ఏర్పాటు చేయించారు. ఈ ప్లాంట్‌లో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. 150 పడకలకు ఒకేసారి ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. గురువారం కలెక్టర్ భారతీ హోళికేరీ ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బంది లేకుండా నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు జనరేటర్‌ను అనుసంధానం చేయాలని సూచించారు.
ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ నూతన అరవింద్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ఆక్సీజన్ ప్లాంట్ ఇన్చార్జి శ్రీలత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, కౌన్సిలర్ సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.