ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ
ఊరూరా ఆడిపాడిన ఆడబిడ్డలు
కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించిన మహిళలు
దండేపల్లి, అక్టోబర్6: ‘ఉమ్మడి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి తదితర పూలు సేకరించి సిబ్బి, ఇత్తడి పాత్రల్లో బతుకమ్మలను పేర్చారు. గౌరమ్మలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లల్లో పెట్టి.. మాస్కులు ధరించి ఆడిపాడారు. అనంతరం స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఎంగిలిపూలతో మొదలైన ఈ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో..ఒక్కేసి పువ్వేసీ చందమామ..ఒక్క జాములాయే చందమామ..’అంటూ ఆడబిడ్డలు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
చెన్నూర్ పట్టణంలో..
చెన్నూర్, అక్టోబర్ 6: చెన్నూర్‌లో బతుకమ్మ పండుగ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో, పలు వాడల్లో పారిశుధ్య పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు పరిశీలించారు.
కళాశాలల్లో ఘనంగా వేడుకలు
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 6 : పట్టణంలోని ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల, వాగ్దేవి డిగ్రీ కళాశాలల్లో బుధ వారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేశ్, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట పట్టణంలో..
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 6 : పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలల్లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ ఉపాధ్యాయులున్నారు.
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 6: ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు పలు వార్డుల్లో ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య బుధవారం పరిశీలించారు. పాత మంచిర్యాలలో బతుకమ్మ ఆడే ప్రదేశాలను చదును చేయించారు. విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు. పలు వార్డుల్లో ఆయా కౌన్సిలర్లు కూడా ఏర్పాట్లు చేశారు.
శ్రీరాంపూర్‌లో..
శ్రీరాంపూర్, అక్టోబర్ 6: నస్పూర్ మున్సిపాలిటీలోని సీసీసీ, కృష్ణాకాలనీ, శ్రీరాంపూర్ కాలనీ, ఆర్కే 6గుడిసెలు, కొత్తరోడ్, అరుణక్కనగర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి.
కాసిపేట మండలంలో..
కాసిపేట, అక్టోబర్ 6 : కాసిపేట మండలంలో గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. సోమగూడెంలో మహిళలు ఆట పాటలతో సందడి చేశారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, అక్టోబర్ 6 : కోటపల్లితో పాటు చుట్టు పక్కల గ్రా మాల్లో బతుకమ్మలను పేర్చి ఆలయాల ఆవరణలు, ప్రధా న కూడళ్లలో బతుకమ్మ ఆడారు.
రామకృష్ణాపూర్లో..
రామకృష్ణాపూర్, అక్టోబర్ 6: రామకృష్ణాపూర్లో కార్మిక వాడలతో పాటు, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కార్మిక వాడలతో పాటు అమరవాది, శేషుపల్లి, క్యాతనపల్లి, దుబ్బపల్లి, గద్దెరాగడి, కుర్మపల్లి, కొత్త తిమ్మాపూర్, పాత తిమ్మాపూర్, తదితర వార్డుల్లో బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు.