కొద్ది రోజులుగా పశువులపై దాడులు
తాజాగా ఒడ్డుగూడెంలో మేకల కాపరిపై పంజా
తీవ్ర గ్రాయాలతో మంచిర్యాల దవాఖానలో చేరిన శంకర్
పులి పాదముద్రలను గుర్తించిన సిబ్బంది
మహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న అధికారులు
అటవీ గ్రామాల్లో భయాందోళనలు
అప్రమత్తంగా ఉండాలి : డీఎఫ్‌వో శివాణి డోగ్రా
మంచిర్యాల జిల్లాలో యథేచ్ఛగా సంచారం
మంచిర్యాల, అక్టోబర్ 1, (నమస్తే తెలంగాణ)/వేమనపల్లి : మంచిర్యాల జిల్లాలో పులి కలకలం రేపుతున్నది. కొంతకాలంగా అటవీప్రాంతంలో సంచరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నది. ఇటీవల పశువులపై దాడి చేసి చంపిన ఘటనలు ఉండగా, గురువారం వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన మేకల కాపరి ఎల్ముల శంకర్‌పై పంజా విసరడం ఆందోళన కలిగిస్తున్నది. అటవీశాఖ సిబ్బంది పాదముద్రలను గుర్తించి, కొత్తగా వచ్చిన టైగర్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులు, కూలీలు నిత్యం చేన్లలోనే ఉంటుండగా, ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు.
మంచిర్యాల జిల్లాలో పులి కలకలం రేపుతున్నది. చెన్నూర్, బెల్లంపల్లి అటవీ డివిజన్లు పులులకు ఆవాసంగా మారగా, యేటా కొత్త పులుల రాక కూడా పెరుగుతున్నది. కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు తర్వాత మహారాష్ట్రలోని తడోబా నుంచి జిల్లా అడవుల్లోకి పులుల రాకపోకలు పెరిగాయి. ప్రాణహిత నుంచి కదంబా అడవుల మీదుగా చెన్నూర్ ప్రాంతం నుంచి కవ్వాల్ వరకు పులులు సంచరించేలా ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు అనువుగా ఉండడంతో పులుల రాకపోకలు పెరిగాయి. కొద్ది రోజులుగా రైతులు, కూలీలకు తరచూ కనిపిస్తున్నాయి. గతేడాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిపై దాడి చేసి హతమార్చాయి. కోటపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పశువుల కాపరి కుర్మ వెంకటిపై ఓ పులి దాడి చేసింది. తాజాగా గురువారం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన మేకల కాపరి ఎల్ముల శంకర్‌పై దాడి చేసి గాయపరచడం కలకలం రేపుతున్నది.
మంచిర్యాలలో చికిత్స..
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ఒడ్డుగూడేనికి చెందిన ఎల్ముల శంకర్ (63) మేకలు మేపేందుకు గురువారం అడవికి వెళ్లాడు. మధ్యా హ్నం 3 గంటల ప్రాంతంలో పులిదాడి చేసింది. తన చేతిలో ఉన్న గొడ్డలితో పులిని ప్రతిఘటించాడు. గాయపడ్డ అతడికి స్థానిక పీహెచ్సీలో ప్రాథమికంగా చికిత్స అందించి, ఆపై మంచిర్యాలలోని ఓ ప్రవేట్ దవాఖానకు తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు పులులు పశువుల మంద, మేకలు, గొర్రెలపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం మనిషిపై పులి దాడి చేయడం చర్చనీయాంశమైంది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, అర్ధరాత్రి అడవి వైపు వెళ్లొద్దని జిల్లా అటవీశాఖ అధికారి శివాణి డోగ్రా కోరుతున్నారు.
భయం భయం..
అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై పు లి దాడులు సాధారణం. ప్రస్తుతం మనిషిపై పంజా విసరడం ఆందోళన కలిగిస్తున్నది. ఒడ్డుగూడెం గ్రా మానికి 500 మీటర్ల దూరంలోనే శంకర్‌పై పులి దాడి చేయడంతో కల్లెంపల్లి, జాజులపేట, సుం పుటం , రాజారాం, చామనపల్లి, బమ్మెన తదితర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా రు. అటవీ గ్రామాల ప్రజలు అత్యధికంగా వ్యవసాయం చేస్తుంటారు. అటవీ జంతువులు, పులులు కనిపించడం వారికి సాధారణ విషయమే. కానీ మనుషులపై పులిదాడి చేస్తుండడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
బాగనే రక్తం పోయింది..
మంచిర్యాల ఏసీసీ, అక్టోబర్ 1 : మా తండ్రి కూడా గొడ్లు కాసి బతికేది. మా నాయనకు 9 మంది పిల్లలు. నాకూ 9 మంది పిల్లలు. 22 ఏండ్లసంది పశువులు కాసి కుటుంబాన్ని సాదుకుంటున్న. నాకు 15 ఏండ్ల సందే పులి గురించి ఎరుక. ఇంతకముందు ఓసారి మేకను పడితే, గొడ్డలి కామతో పులిని కొట్టి నోట్ల నుంచి మేకను గుంజి తీసుకచ్చిన. చాలాసార్లు పులి ఎదురైంది. గురువారం మేకలను తిప్పుకొని వస్తుండగా, పులి దాడి చేసింది. ఇప్పుడు పెద్దగా దెబ్బతాకింది. బాగనే రక్తం పోయింది. అయినా అడవిలోంచి నడుసుకుంటూ ఊర్లకచ్చిన. పడిపోయి కీకపెట్టిన. మా ఆమెకు, బిడ్డకు చెప్పిన. చెయ్యి బొక్క ఇరిగింది. అంబులెన్స్‌ల మంచిర్యాలకు తీసుకచ్చిన్రు. గిప్పుడు బాగానే ఉన్న. ఇప్పటిదాకా మేకలు, పశువుల మీద దాడి చేసేటివి. గిప్పుడు నా మీద పడ్డది.
దాడి చేసింది కొత్తపులే..
ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఎల్ముల శంకర్‌పై దాడి చేసింది కొత్తగా వచ్చిన పులిగా అటవీ అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివాణి డోగ్రా శుక్రవారం మధ్యాహ్నం ఒడ్డుగూడెంకు వెళ్లి వివరాలు సేకరించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అటవీ అధికారులు పులి పాదముద్రలను సేకరించారు. ఆ పాదపు కొలతలను నమోదు చేసుకున్నారు. కాగా.. ప్రస్తుతం జిల్లాలోని కోటపల్లి అటవీ ప్రాంతంలో జే1 పులి సంచరిస్తుండగా, ఏ2 పులి మధ్యమధ్యలో ఈ అటవీ ప్రాంతానికి వస్తూ పోతున్నట్లు తెలిసింది. మన ప్రాంతంలో పులులు ఇప్పటి వరకు పశువుల పైన మాత్రమే దాడులు చేయగా, ఏ2 పులి మనుషులపై దాడి చేసే అవకాశం ఉండడంతో తొలుత దాడి చేసిన పులి ఏ2గా అనుమానించారు. అటవీ అధికారులు సంఘటన స్థలంలో సేకరించిన పాద ముద్రలు, ఏ2 పాదముద్రల్లో వ్యత్యాసం ఉండగా, ఈ ప్రాంతానికి కొత్త పులి వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో అటవీ డివిజన్ నుంచి ఏదైనా పులి మన ప్రాంతానికి వచ్చి ఉంటుందా? అని అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
పులి దాడి నేపథ్యంలో వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం పరిసర అటవీప్రాంతంలో మా సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించాం. మేకలకాపరి ఎల్ముల శంకర్‌ను చూసి భయపడి పారిపోయే ప్రయత్నంలో దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నాం. జంతువు కావాలని దాడి చేసినట్లుగా లేదు. దాడి చేస్తే తీవ్ర గాయాలయ్యేవి. కొత్త పులి వచ్చినట్లు భావిస్తున్నాం. సాధారణంగా అటవీ పరిసర ప్రాంతాల్లో పులులు వస్తూ, పోతూ ఉంటాయి. సమీప ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొద్ది రోజులు ఉండి మరో ప్రాంతాలకు కూడా వెళ్లవచ్చు. పక్క జిల్లా వారితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తెల్లవారు జామున, రాత్రి పూట అడవిలోకి వెళ్లవద్దు. ప్రజల్లో అవగాహన పెరగాలి. రెసిడెన్షియల్ టైగర్స్ వాటి పరిధిలోనే సంచరిస్తున్నాయి.
ఆందోళన వద్దు..
వేమనపల్లి, అక్టోబర్ 1 : మేకల కాపరిపై పులిదాడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తరచూ మేకలు, పశువులపైనే దాడి చేసేది. ఇప్పుడు కాపరిపై దాడి చేసింది. చేన్లలో పత్తి తీసే సమయం కావడంతో రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రంలోపే ఇండ్లకు చేరుకోవాలి. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. గ్రామస్తులకు సలహాలు, సూచనలు చేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నాం. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చని అనుకుంటున్నాం.