తలమడుగు, ఆగస్టు 28 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గురువారం అంతర్రాష్ట్ర రహదారిపై మహిళలు, గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. నాలుగు గంటలపాటు కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం వర్షం ఎక్కువ కావడంతో వర్షంలో సైతం రాస్తారోకో చేపట్టారు. తహసీల్దార్ రాజమోహన్, ఎస్సై రాధిక సముదాయించిన వినలేదు. కలెక్టర్ రాజర్షి షా వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజప్రాతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో బ్రిడ్జి చిన్నగా ఉండడంతో వర్షపు నీరు ఇండ్లలోకి వస్తుందని గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తహసీల్దార్, ఆర్అండ్బీ అధికారులు వంతెన వద్ద జేసీబీతో తాత్కాలిక పనులు చేపట్టారు. దీంతో కాలనీ వాసులు రాస్తారోకో విరమించారు. పనులు చేపట్టకపోతే మళ్లీ రాస్తారోకో చేపడుతామని హెచ్చరించారు.
చిన్నపాటి వర్షాలకే పొలాల నుంచి వర్షపు నీరు కాలనీలోకి వస్తున్నాయి. దాదాపు 50 కుటుంబాలు ఉంటాయి. ఇండ్లలోకి నీరు రావడంతో ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఇలాగే ఇబ్బందులు వస్తే రాస్తా రోకో చేశాం. అధికారులైన సమస్యను పరిష్కరించలేదు. వర్షం పడితే భయ మేస్తున్నది. చిన్న పిల్లలను పట్టుకుని వేరే చోటికి వెళ్లాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మించాలి.
– కోండ్రు ఈశ్వర్ దాస్, ఖోడద్ గ్రామస్తుడు.
కల్వర్టు వద్ద వంతెన నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అధికారులు, నాయకులు ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా? సమస్యకు పరిష్కారం వెతుకుతారా? రోడ్డుపై గంటల తరబడి రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. నాలుగు గంటలు రాస్తారోకో చేస్తే ఒక జిల్లా అధికారి అయినా వచ్చి మమ్మల్ని పలకరించలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థమవుతున్నది.
– పసుపుల చరణ్, ఖోడద్ గ్రామస్తుడు.
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు ఇండ్లలోకి చేరింది. నిత్యావసర సరుకులు, దుస్తులు తడిచి ముద్దయ్యాయి. రాత్రంతా పిల్లలను పట్టుకుని భయం భయంగా గడిపాం. సమస్య ఉందని వచ్చి చూసి పోతున్నారు.. కానీ పరిష్కారం చూపడం లేదు. వర్షంలోనే రోడ్డుపై ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. కాలనీ వాసులందరం పిల్లలతో పస్తులుండి రోడ్డుపై కూర్చున్నాం. మా లాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు.
– అల్లనేరడి ప్రణీత, ఖోడద్ గ్రామస్తురాలు
నాలుగు గంటలు వర్షంలో రోడ్డుపై కూర్చున్నా.. ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి, నాయకులైనా రాలేదు. కనీసం కలెక్టర్ సార్ వచ్చి చూస్తాడేమోనని చూశాం. మండలాధికారులతో మొరపెట్టుకుని ఏడ్చిన లాభం లేదు. పరిష్కారం చూపకపోతే మళ్లీ రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేస్తాం. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు.. ఇప్పుడు రాకపోవడం చూస్తుంటే కోపం వస్తున్నది.
– భగత్ మహేందర్, ఖోడద్ గ్రామస్తుడు