దిలావర్పూర్, సెప్టెంబర్ 16 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వైభవంగా నిర్వహించింది. పండుగ పూట అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునేందుకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. 2023 తరువాత అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీని నిలిపివేసింది.
ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగకు రేవంతన్న కానుక పేరిట చీరలను అందించేందుకు కసరత్తు చేస్తున్నది. అప్పట్లో నా అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులకు కేసీఆర్ ఒక్క చీర ఇస్తే.. మా సర్కారు రెండు చీరలు ఇస్తామని ప్రకటించారు. ఈ చీరలను మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్న మహిళకు మాత్రమే ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
గతంలో రెండు చీరలు ఇస్తామన్న సర్కారు, ఇప్పుడు బతుకమ్మ పండుగకు ఒకటి, సంక్రాంతి పండుగకు మరొకటి చొప్పున ఇస్తామని మాట మారుస్తుండడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 504 వీవోలు ఉండగా, 12,050 గ్రామ స్వయం సహాయక సంఘాల్లో 1,39,983 మంది సభ్యులుగా ఉన్నారు. ఇంకా 75 వేలకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘంలో సభ్యులు కానివారు ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రేషన్‌కార్డుదారులకు ఇచ్చారు..
కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డల ఆనందం కోసం రేషన్ కార్డులో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి రేషన్ దుకాణాల ద్వారా చీరలు అందించింది. కాంగ్రెస్ సర్కారు నిబంధనలు సడలించి మహిళా సంఘంలో సభ్యులకు మాత్రమే ఇస్తామని చెబుతున్నది.
దీనిపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు చీరల పంపిణీ తలనొప్పిగా మారుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు. కాగా.. బతుకమ్మ పండుగ ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ సర్కారు ఇచ్చే చీరలు జిల్లా, మండల కేంద్రాలకు చేరలేదు.
ఆడబిడ్డలందరికీ అందించాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే బతుకమ్మ చీరలు అందిస్తామనే విషయం అధికారుల ద్వారా తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి మహిళకు అందించాలి. ప్రస్తుత ప్రభుత్వం మహిళా సంఘంలో సభ్యులు కానీ వారికి ఇవ్వరని తెలుస్తున్నది. మిగతా మహిళలు తెలంగాణ ఆడబిడ్డలు కాదా? ఏ విధమైన షరతులు విధించకుండా అందరికీ చీరలు అందించాలి. ఇప్పటికే ఒక సంవత్సరం కాంగ్రెస్ సర్కారు అందించలేదు.
– ఏలాల అమృత, మాజీ ఎంపీపీ (దిలావర్పూర్)